అవినీతిపై విచారణ జరిపించాలి
వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఉదయేంద్రం గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని తమిళనాడు ప్రభుత్వ అన్ని శాఖల ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాజవేలు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామ పంచాయతీలో తాత్కాలిక కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తి అదే పంచాయతీలో 25 చెక్కుల ద్వారా ఈనెల 9వ తేదీన రూ.కోటి నగదును మార్చుకున్నారని వీటిని పొన్నేరి సమీపంలోని మండల వాడి గ్రామంలో కొత్త భవనాల నిర్మాణం కోసం ఉపయోగించినట్లు రికార్డులు సృష్టించారన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం వచ్చిన నిధులను దుర్వినియోగం చేయడంతో వీటిపై విచారణ జరిపించాలని గ్రామ పంచాయతీల జిల్లా అధికారికి, బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారులకు వీటిపై ఫిర్యాదు చేశామన్నారు. సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి నిధులు స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు విచారణ జరిపించకుంటే తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉంటామన్నారు. ఆయనతో పాటు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.


