అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభం
సాక్షి, చైన్నె: టీఎన్‌సీసీలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలైంది. ఇందుకు సంబంధించి పార్టీ వర్గాలతో ఏఐసీసీ కమిటీ మంగళవారం భేటీ అయింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, రాహుల్‌తో రెండు రోజుల పాటుగా తమిళనాడు, పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ గిరిష్ చోదన్కర్, ఏఐసీసీ ప్రతినిధులు సూరజ్ హెగ్డే, నివేదిత్ ఆళ్వాలు, టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, శాసన సభా పక్ష నేత రాజేష్‌కుమార్‌తో కూడిన కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీ తదుపరి 71 జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షులను ప్రకటించారు. ఈ పరిస్థితులలో ఢిల్లీ నుంచి వచ్చిన ఈ కమిటీ మంగళవారం సత్యమూర్తి భవన్‌లో ముఖ్య నేతలు, జిల్లాల అధ్యక్షులుగా నియమితులైన వారితో సమావేశమైంది. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా చోదన్కర్ వివరించారు. కూటమి విషయంగా సీట్ల పందేరం, తదితర అంశాలగురించిబహిరంగా వ్యాఖ్యలు చేయవద్దు అని హెచ్చరించారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరో అన్న కసరత్తులు మొదలయ్యాయని, అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడాల్సిందేనని స్పష్టం చేశారు.


