మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన
తిరుత్తణి: మాదక ద్రవ్యాల నిర్మూలనపై తిరుత్తణిలో విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. తిరుత్తణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, డాక్టర్ రాధాకృష్ణన్ ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాల సంయుక్తంగా మంగళవారం మాదక ద్రవ్యాల నిర్మూలనపై సైకిల్ ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. పాఠశాల ఆవరణ నుంచి ప్రారంభమైన విద్యార్థుల సైకిల్ ర్యాలీని పాఠశాల హెచ్‌ఎం బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు. కళాశాల, పాఠశాల ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ విద్యార్థులు వంద మంది పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టి పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీగా వెళ్లి మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపూ అవగాహన కల్పించారు. విద్యార్థులు, యువకుల చేతికి మాదక ద్రవ్యాలు చేరకుండా నిర్మూలనపై కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. గాంధీ రోడ్డు, బైపాస్, చిత్తూరు రోడ్డు సహా ప్రదాన మార్గాల్లో ర్యాలీగా వెళ్లి చివరగా కమల కూడలి వద్ద ర్యాలీ ముగించారు.


