తుది మెరుగులు
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ పార్టీ తరపున మ్యానిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్నారు. వారం రోజులలో విజయ్‌కు ఈ మ్యానిఫెస్టో అందజేయనున్నట్టు సంబంధిత కమిటీ మంగళవారం ప్రకటించింది. తొలిసారిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీవీకే అధినేత విజయ్ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈప్రయాణంలో ఆయనకు ఎదురవుతున్న ఒడి దొడుగులు మరీ ఎక్కువే. మీట్ దిపీపుల్ అంటూ ప్రజలలోకి వెళ్తున్న సమయంలో కరూర్ విషాద ఘటన ఆయనకు బ్రేక్ వేసింది. ఆతదుపరి ఈ ప్రయాణం అన్నది ముందుకు సాగడం లేదు. అదే సమయంలో తన చివరి చిత్రంగా పేర్కొంటున్న జననాయకన్ విడుదల వివాదంలో మునిగింది. ఈ పరిస్థితులో ఎన్నికల ప్రచార వ్యవహారాలన్నీ పర్యవేక్షించేందుకు ముందు జాగ్రత్తగా కమిటీని రంగంలోకి దించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, డిప్యూటీ ప్రచార కార్యదర్శి ఆదవ్ అర్జునన్, వర్కింగ్ కమిటీ కన్వీనర్ సెంగొట్టయ్యన్‌త పాటూ పార్తీబన్, రాజ్‌కుమార్, విజయ్ దాము, ఎస్‌పీ సెల్వం, కె. పిచాయ్ రత్నం, తదితరులతో 10 మందిని నియమించారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాలలలో ఎన్నికల ప్రచారాలకు సంబంధించిన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు వంటి అన్ని వ్యవహారాలను ఈ కమిటీ పర్యవేక్షణలో జరిపే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పనకు మరో కమిటీని నియమించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ నేతృత్వంలోని ఈ కమిటీలో అరుణ్ రాజ్, జేసిటీ ప్రభాకర్, ఎన్. ఆనంద్, రాజ్ మోహన్, తదితరులు ఉన్నారు. ఈ కమిటీ అన్ని రకాల పరిశీలనలు, సమగ్ర అధ్యయనంతో నివేదికను సిద్ధం చేసింది. దీనిపై తుది కసరత్తు మొదలెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం పనయూరులోని పార్టీ కార్యాలయంలో ఈ కమిటీ సమావేశం జరిగింది. అన్ని కోణాలలో సాగిన అధ్యయనం, పరిశీలన మేరకు సిద్ధం చేసిన నివేదికలలోని అంశాలను ఇందులో చర్చించారు. దీనిని సమగ్రంగా మ్యానిఫెస్టో రూపంలో సిద్ధం చేసి వారం రోజులలో విజయ్‌కు సమర్పించే విధంగా చర్యలు చేపట్టారు. ఈనెల 25లోపు తుది మెరుగులు పూర్తి చేసి, మ్యానిఫెస్టోను సమగ్ర అంశాలతో అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.


