● సీట్ల పంచాయితీపై కుస్తీ ● ప్రధాన పార్టీలతో నేడు సమావే
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో బీజేపీ చేరిన విషయం తెలిసిందే. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఎన్‌డీఏ కూటమిలో బీజేపి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఎన్‌డీఏ కూటమిని బలోపేతం చేయడానికి రాష్ట్రంలో బీజేపీ వర్గాలు తీవ్ర కుస్తీలు పడుతున్నాయి. బీజేపీరాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్, కో ఇన్‌చార్జ్‌లుగా ఉన్న కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇన్‌చార్జ్‌గా న్యాయశాఖ కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రాం మెహ్వాల్, సివిల్ ఏవియేషన్ కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహుల్ ఇప్పటికే రంగంలోకి దిగారు. అన్నాడీఎంకేతో సంప్రదింపు ముగించారు. ఇక కూటమిలోకి వచ్చే పార్టీలతో సంప్రదింపును విస్తృతం చేశారు. బీజేపీ, అన్నాడీఎంకే కూటమిలోకి ఇప్పటికే అన్బుమణి నేతృత్వంలోని పీఎంకే అధికారికంగా చేరింది. ఇక జీకే వాసన్ తమిళమానిల కాంగ్రెస్, ఏసీ షణ్ముగం పుదియ నిధి కట్చి, రవి పచ్చ ముత్త ఐజేకే వంటి పార్టీలతో చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ పార్టీల తాజాగా ఎన్‌డీఏలో ఉన్నప్పటికీ సీట్ల పందేరం విషయంగా చర్చలలో మునిగి ఉన్నాయి. అదే సమయంలో అమ్మమక్కల్ మున్నేట్రకళగం టీటీవీ దినకరన్‌ను ఎన్డీఏ కూటమిలోకి చేర్చుకునే దిశగా వ్యూహాలకు పీయూష్ గోయల్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన రాష్ట్ర బీజేపీ వర్గాలతో సంప్రదింపు ముగించి, బుధవారం టీటీవీ దినకరన్‌ను కలిసేందుకు సైతం కసరత్తులలో ఉన్నట్టు బీజేపీ వర్గాలు పేర్కొటున్నాయి.
ప్రధాని సభకు ముమ్మర ఏర్పాట్లు
ఈనెల 23వ తేదీన మధురాంతకం వేదికగా జరిగే సభలో కూటమి పార్టీల నేతలందర్నీ ఒకే చోట చేర్చే విధంగా, ఎన్‌డీఏ కూటమి బలాన్ని ప్రకటించే విధంగా కసరత్తు వేగవంతం చేశారు. ఈ బహిరంగ సభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరు అవుతుండడంతో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. చైన్నె విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మదురాంతకంకు పీఎం వెళ్లనున్నారు. ఇందుకోసం అక్కడ ప్రత్యేక హెలిప్యాడ్ సిద్ధం చేశారు. మోదీ సమక్షంలో ఎన్‌డీఏ కూటమిని ప్రకటించేందుకు తగ్గట్టుగా పీయూష్ గోయల్ స్థానికంగా తిష్ట వేసి రచిస్తున్న వ్యూహాలన్నీ ఏ మేరకు ఫలితాల్ని ఇస్తాయో శుక్రవారం తేలనున్నది. అలాగే, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళని స్వామితో పోన్ ద్వారా ఎప్పటికప్పుడు పీయూష్ చర్చలు జరుపుతూ వస్తున్నట్టు బీజేపీ వర్గాలు పేర్కొనడం గమనార్హం.


