టీవీ తిరువాసకం పాటకు ప్రధాని ప్రశంస
తమిళసినిమా: సంగీత దర్శకుడుగా జీవీ. ప్రకాష్ కుమార్ శతకాన్ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో నటుడుగానూ రాణిస్తున్న ఈయన తాజాగా తిరువాసకానికి సంబంధించిన ఓ భక్తిరస గీతానికి సంగీతాన్ని సమకూర్చారు. కాగా ఇటీవల ఢిల్లీలో కేంద్రమంత్రి మురుగన్ స్వగృహంలో పొంగల్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు జీవీ. ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చిన తిరువాసకంలోని ఒక భక్తిరస గీతాన్ని ఆయనే స్వయంగా ఆలపించారు. ఈ భక్తి గీతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భక్తి పారవశ్యం పొంది జీవీ. ప్రకాష్ కుమార్‌ను ఎంతగానో ప్రశంసించారు. దీని గురించి జీవీ. ప్రకాష్ కుమార్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తిరువాసకంలో ఒక భాగానికి సంబంధించిన భక్తి రస గీతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు లభించడం సంతోషంగా ఉందన్నారు. తిరువాసకాన్న పూర్తిగా వీడియో ఆల్బమ్ రూపంలో రూపొందించాలన్నది తన చిరకాల కోరిక అని పేర్కొన్నారు. దాన్ని సంప్రదాయ సంగీతంతో రూపొందించి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్నది తన లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా తొలి ప్రయత్నంగా తీరువాసకంలోని ఒక భాగాన్ని సాంప్రదాయ సంగీతంతో భక్తి రస గీతాన్ని సమకూర్చినట్లు, ఈ పాట తో కూడిన వీడియోను ఈనెల 22వ తేదీన తన యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయనున్నట్లు చెప్పారు. అదే విధంగా ఇకపై వరుసగా తిరువాసకం భక్తి పాటలతో కూడిన వీడియోలను విడుదల చేస్తానని ఆయన వెల్లడించారు.
తిరువాసగం గీతాన్ని ఆలపిస్తున్న జీవీ ప్రకాష్‌కుమార్


