ఐఐటీలో జీడీసీ సదస్సు
కొరుక్కుపేట: భారతదేశంలో ఆవిష్కరణ, వ్యవస్థాపకతను ప్రజాస్వామ్యీకరించడంపై దృష్టిసారించే దిశగా ఐఐటీ మద్రాసులో జీడీసీ సదస్సు జరిగింది. ఇందులో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు, ఏఎన్‌ఆర్‌ఎఫ్ డాక్టర్ శివకుమార్ కే, ఎన్‌ఐటీఐ ఆయోగ్ డాక్టర్ శశాంక్ షా, ఐఐటి –మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి, ఫాస్ట్ ఇండియా వరుణ్ అగర్వాల్, ప్రముఖ పూర్వవిద్యార్థులు, ఇతర కార్పొరేట్ నాయకులు, విద్యా వేత్తలు, అలాగే డాక్టర్ గురురాజ్ దేశ్‌పాండే, క్రిష్ గోపాలకృష్ణన్ తదితరులు పాల్గొని ఆవిష్కరణలపై కీలక ప్రసంగాలు చేశారు. ఐఐటీ మద్రాసులోని గోపాల కృష్ణన్–దేశ్ పాండే సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ (జిడిసి) వార్షిక సదస్సు భారతదేశంలో ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను ప్రజాస్వామ్యీకరించడం అనే అంశంపై జరిగింది. పాల్గొన్న వక్తలు భారతదేశంలో టైర్ –2 నగరాల నుంచి స్టార్టప్‌లు వేగంగా పెరుగుతున్న తరుణంలో మహిళా వ్యవస్థాపకుల భాగస్వామం పెరగడం, డిజిటల్ ప్లాట్‌ఫారంల అందుబాటులోకి రావడం ముదావహమని వ్యాఖ్యానించారు. ముందుగా ప్రొఫెసర్ కామకోటి మాట్లాడుతూ ఐఐటీ మద్రాసులో విద్య , వ్యవస్థాపకత పెద్ద ఎత్తున జరుగుతుందని అన్నారు. ఆన్‌లైన్ బీఎస్ ప్రోగ్రామ్ దాదాపు 50 వేల మంది విద్యార్థులకు, వారిలో చాలా మంది ఆర్థికంగా బలహీనమైన కుంటుంబాలకు చెందిన వారికి ఉత్తమ విద్యను పొందేందుకు వీలు కల్పిస్తుందని అన్నారు. అంతేకాకుండా ఐఐటీ మద్రాసు భారతదేశం అంతటా ఉన్న స్టార్టప్‌లు, వ్యవస్థాకులకు జీడీసీలోని దాని ల్యాబ్‌లు, ఇంక్యుబేటర్లు, ఫ్యాకల్టీ, ప్రోగ్రామ్‌ల నుంచి నేర్చుకోవడానికి వీలు కల్పిస్తోందని తెలిపారు .


