నాసిరకం వస్తువుల విక్రయం
తిరువళ్లూరు: నాసిరకం వస్తువులను విక్రయిస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదు మేరకు తిరువళ్లూరు పుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేసి వంద కిలోల పిండి, 20 కిలోల ఖర్జూరపు పండ్లును స్వాధీనం చేసుకుని సంబంధిత దుకాణానికి నోటీసులు జారీ చేశారు. తిరువళ్లూరు పట్టణంలోని ఆయిల్‌మిల్ వద్ద కోవై పండ్లు, నిత్యావసర వస్తువుల దుకాణం పేరిట షాపును నిర్వహిస్తున్నారు. ఈ షాపులో నిత్యావసర వస్తువులు, పండ్లును విక్రయిస్తున్నారు. అయితే దుకాణంలో కొనుగోలు చేసిన వస్తువులు నాసిరకంగా ఉన్నట్టు కొందరు తిరువళ్లూరు పుడ్‌సేఫ్టీ విభాగానికి ఫిర్యాదు చేశారు. గోధుమ, రాగి తదితర పిండిలో పురుగులు వస్తున్నాయని, ఖర్జూరపు పండ్లు సైతం నాసిరకంగా ఉన్నట్టు ఫొటోలతో సహా పిర్యాదు చే శారు. సమాచారం అందుకున్న అధికారులు సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో గోధుమ, రాగితో పాటు పలు పిండి వస్తువులలో పురుగులు వున్నాయని, పండ్లులోనూ నాసిరకం వున్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దుకాణానికి వివరణ కోరుతూ నోటీసులు సైతం జారీ చేశారు.


