● కోవళం సమీపంలో నిర్మాణం ● పనులకు సీఎం స్టాలిన్‌ శంకు స్థాపన ● కలైంజ్ఞర్‌ సెంటర్‌ పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

● కోవళం సమీపంలో నిర్మాణం ● పనులకు సీఎం స్టాలిన్‌ శంకు స్థాపన ● కలైంజ్ఞర్‌ సెంటర్‌ పనుల పరిశీలన

Jan 20 2026 7:54 AM | Updated on Jan 20 2026 7:54 AM

● కోవ

● కోవళం సమీపంలో నిర్మాణం ● పనులకు సీఎం స్టాలిన్‌ శంకు స

● కోవళం సమీపంలో నిర్మాణం ● పనులకు సీఎం స్టాలిన్‌ శంకు స్థాపన ● కలైంజ్ఞర్‌ సెంటర్‌ పనుల పరిశీలన

సాక్షి, చైన్నె: చైన్నె మహానగరానికి పుళల్‌, పూండి, చోళవరం, సెంబరబాక్కం, తేర్వాయి కండ్రిగ రిజర్వాయర్లు, కడలూరు జిల్లా కాట్టుమన్నార్‌ కోవిల్‌లోని వీరాణం చెరువు నీటిని సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆంధ్రా నుంచి వచ్చే కృష్ణ జలాలు ఆదుకుంటున్నాయి. ఇక నిర్లవణీకరణ పథకం ద్వారా సముద్రపు నీటిని శుద్ధీకరించి సరఫరా చేస్తున్నారు. సరాసరిగా రోజుకు చైన్నె నగర అవసరాలకు 70 కోట్ల లీటర్ల మేరకు నీటిని అందిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చైన్నె తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో ఏటా ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో కురిసే వర్షాలకు నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తూ వస్తున్నాయిది. దీనిని పరిగణించి పూండి, పుళల్‌ రిజర్వాయర్‌ల ఉబరి నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా కుశస్థలి తీరంలోని సడయకుప్పం వద్ద అతి పెద్ద రిజర్వాయర్‌ నిర్మాణం అవసరమని వాటర్‌ బోర్డు వర్గాలు గుర్తించాయి. ఈ పనులలో జాప్యంతో పాటూ ఆక్రమణల తొలగింపు తదితర కొన్ని సమస్యలు ఎదురు అవుతాయని కూడా భావించారు. దీంతో సడయకుప్పంను పక్కన పెట్టి, ముందుగా పూండి రిజర్వాయర్‌ ఉబరి నీటిని మాత్రం సద్వినియోగం చేసుకునే విధంగా సమీపంలోని రామంజేరిలో ఓ రిజర్వాయర్‌కు నివేదిక సిద్ధం చేశారు. ఇక్కడ 1.5 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచేందుకు వీలుగా నిర్మాణాలు చేపట్టేద దిశగా కార్యాచరణపై దృష్టి పెట్టారు. అదే సమయంలో ఓఎంఆర్‌ మార్గంలో సైతం ఓ రిజర్వాయర్‌కు సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం తొలి ప్రాధాన్యతగా ఈ పనులపై దృష్టి పెట్టారు.

మామల్లన్‌ పేరుతో..

చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్‌, తిరుక్కళి కుండ్రం సర్కిల్‌లలోని ఈస్ట్‌ కోస్టు రోడ్డు, ఓల్డ్‌మహాబలిపురం రోడ్డు, కోవళం రాజీవ్‌ గాంధీ రోడ్డు పరిసరాలను కలుపుతూ ఈ కొత్త రిజర్వాయర్‌ నిర్మాణం జరగనుందని వివరించారు. ఈ రిజర్వాయర్‌కు 69 చెరువులను ంచి విడుదలయ్యే మిగులు జలాలలను మళ్లించనున్నామన్నారు. సముద్రంలోకి వృథాగా వెళ్తున్న నీటిని ఉపయోగించుకునేందుకే ఈ రిజర్వాయర్‌కు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ రిజర్వాయర్‌ కోసం తిరువిడంతై నుంచి కోకిలమేడు వరకు 5,161 ఎకరాలు స్థలం ఎంపిక చేశామన్నారు. మొత్తం 1.65 టీఎంసీల సామర్థ్యంతో మొత్తంగా 34 కిలోమీటర్ల పొడవుతో ఈ రిజర్వాయర్‌ ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా, రోజుకు 170 మిలియన్‌ లీటర్ల తాగు నీటిని అందించేందుకు వీలుందన్నారు. చైన్నె శివారులలో శర వేగంగా దూసుకెళ్తున్న షోళింగనల్లూరు, మేడవాక్కం, పళ్లికరణై, సిరుచ్చేరి, కేలంబాక్కం, తిరుపోరూర్‌, మహాబలి పురం పరిసరాలలో నివసించే 1.3 మిలియన్ల మందిప్రజలకు తాగునీటిని అందించే వర ప్రదాయినిగా ఈ రిజర్వాయర్‌ అవతరిస్తుందన్నారు. కాంచీపురం రాజధానిగా ఉన్న తొండై ప్రాంతంలో మూడవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు పల్లవులు పాలించారని గుర్తు చేస్తూ, అందుకే ఈ రిజర్వాయర్‌కు పల్లవులలో ’మామల్లన్‌’ గా గౌరవించబడే మొదటి రాజు పేరును నామకరణం చేస్తున్నామని ప్రకటించారు.ఈ సందర్భంగా ’ఉత్తమ నీటి సంరక్షణ’ అవార్డును స్వచ్చంద సంస్థకు సీఎం ప్రదానం చేశారు.

కలైంజ్ఞర్‌ అంతర్జాతీయ కేంద్రం

చెంగల్పట్టు జిల్లా ముట్టుకాడులో రూ. 525 కోట్ల వ్యయంతో కలైంజ్ఞర్‌ ఇంటర్నేషనల్‌ కాన్పరెన్స్‌ సెంటర్‌ నిర్మాణ పనులు జరుగుతన్న విషయం తెలిసిందే. ఈసీఆర్‌ మార్గంలో 37.99 ఎకరాలలో పనులు జరుగుతున్నాయి. కలైంజ్ఞర్‌ అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌గా రూపుదిద్దుకుంటున్న ఇక్కడి పనులను సీఎం పరిశీలించారు. చైన్నెలో ఒక కొత్త ప్రపంచ స్థాయి అంతర్జాతీయ వేదిక తీర్చిదిద్దే రీతిలో నిర్మాణాలు జరగాలని అధికారులను ఆదేశించారు. పనులలో నాణ్యత పెరగాలని, త్వరితగతిన వినియోగంలోకి తీసుకు వచ్చే విధంగా పనుల వేగం పెంచాలని ఆదేశించారు.

భవిష్యత్తు అవసరాల కోసం..

శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ, గాలి, నీరు అవసరం గురించి ప్రస్తావిస్తూ, వ్యవసాయానికి తాము ఇస్తున్న ప్రాధాన్యత, జలవనరుల అభివృద్ధికి చేపట్టిన కార్యాచరణను వివరించారు. జల వనరుల పునరుద్ధరణే కాదు, గత ఐదు సంవత్సరాలుగా మేట్టూరు జలాశయం పూర్తిగా నిండుతూ వస్తున్నట్టు తెలిపారు. 2021–25 కాలంలో రూ. 459 కోట్లతో 24 వేల 833 కి.మీ దూరం పూడిక తీత పనులు జరిగాయని రాష్ట్రవ్యాప్తంగా 121 కొత్త చెక్‌ డ్యామ్‌ల నిర్మించామని ప్రస్తావించారు. తామర భరణి – కారుమేనియారు – నంబియారు అనుసంధాన కెనాల్‌ ప్రాజెక్ట్‌ గత ఏడాది ఉపయోగంలోకి వచ్చిందన్నారు. చైన్నె మహానగరం శర వేగంగా అభివృద్ధి చెందుతున్నదని గుర్తు చేస్తూ, ఇందులో ద్రావిడ మోడల్‌ ప్రభుత్వ పాత్ర గురించి పేర్కొన్నారు. పెరుగుతున్న తాగునీటి అవసరాలను పరిగణించి రూ.342 కోట్ల 60 లక్షల అంచనా వ్యయంతో ఈ రిజర్వాయర్‌ నిర్మిస్తున్నామని ప్రకటించారు.

కోవళంలో రిజర్వాయర్‌

కోవళం, నెమ్మెలి, తిరుప్పోరూర్‌ పరిసరాలలోని చిత్తడి నెలలను అభివృద్ధి పరిచేవిధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రిజర్వాయర్‌ నిర్మాణానికి సిద్ధమయ్యారు. అన్ని రకాల అనుమతులు దక్కడంతో జల వనరుల శాఖ నేతృత్వంలో పనులకు శ్రీకారం చుట్టే విధంగా సోమవారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సీఎం స్టాలిన్‌, డిప్యూటీ సీఎం ఉదయనిధి, మంత్రులు ఏవి వేలు, అన్బరసన్‌, ఎంపీలు సెల్వం, కళానిధి వీరాస్వామి, ఎమ్మెల్యేలు రాజా, కరుణానిధి బాలాజీ, వరలక్ష్మి, సీఎస్‌ మురుగానందం , చెంగల్పట్టు జిల్లా కలెక్టర్‌ టి. స్నేహ హాజరయ్యారు.

చెంగల్పట్టు జిల్లా నెమ్మెలి, కోవలం పరిసరాలను కలుపుతూ జలవనరుల శాఖ నేతృత్వంలో ఓఎంఆర్‌లో కొత్త తాగునీటి రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రిజర్వాయర్‌కు మామల్లన్‌ అని నామకరణం చేస్తూ పనులకు సీఎం స్టాలిన్‌ సోమవారం శంకు స్థాపన చేశారు.

● కోవళం సమీపంలో నిర్మాణం ● పనులకు సీఎం స్టాలిన్‌ శంకు స1
1/2

● కోవళం సమీపంలో నిర్మాణం ● పనులకు సీఎం స్టాలిన్‌ శంకు స

● కోవళం సమీపంలో నిర్మాణం ● పనులకు సీఎం స్టాలిన్‌ శంకు స2
2/2

● కోవళం సమీపంలో నిర్మాణం ● పనులకు సీఎం స్టాలిన్‌ శంకు స

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement