పుదుచ్చేరి అసెంబ్లీలో గందరగోళం
కొరుక్కుపేట: మంత్రి కార్యాలయం ముందు స్వతంత్ర ఎమ్మెల్యే ఆకస్మిక ధర్నాతో పుదుచ్చేరి అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. పుదుచ్చేరి నగరంలోని ఉరులాయన్ పేట నియోజక వర్గంలోని ఇళ్లకు అపరిశుభ్రమైన తాగునీటిని నిరంతరం సరఫరా చేయడం, ఉప్పనార్‌లో మురుగునీరు కలవకుండా చేయడంలో వైఫల్యం వంటి సమస్యలపై చర్యలు తీసుకోవాలని నియోజక వర్గ ఎమ్మెల్యే ఎ. నెహ్రూ ప్రజా పనుల శాఖను కోరారు. అయితే తగిన చర్యలు తీసుకోకపోవటంతో మంత్రి కార్యాలయం ద్వారం వద్ద ధర్నా చేశారు. దీంతో అక్కడ తీవ్ర కలకలం రేగింది. ఈక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్న మంత్రి తనను కలవాలని ఎమ్మెల్యే నెహ్రూను కోరారు. అలాగే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో ఎమ్మెల్యే నిరసన విరమించారు.
డిజిటల్ మెడికల్ బస్సు
సాక్షి, చైన్నె : గ్రామీణ ప్రజలకు 24 గంటల మెరుగైన వైద్య సేవలు లక్ష్యంగా డిజిటల్ మెడికల్ బస్సును సిమ్స్ ఆస్పత్రి సిద్ధం చేసింది. హలో డాక్టర్ హెల్త్ ఆన్ వీల్స్ మొబైల్ యూనిట్‌గా ప్రత్యేక వైద్య బృందాలతో కూడిన ఈ బస్సుకు ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణియన్ సోమవారం జెండా ఊపారు. ఈ బస్సులో కన్సల్టేషన్, డయాగ్నస్టిక్స్, రిఫరల్స్, ఫాలో అప్‌లతో సహా సజావుగా కాగిత రహిత ంగా ఎండ్ టు ఎండ్ పేషెంట్ కేర్‌కు చర్యలు తీసుకున్నారు. పూర్తిగా డిజిటల్ సౌకర్యంతో కూడిన ఈబస్సు ద్వారా ప్రత్యేక వైద్య బృందాలు గ్రామాలలోకి వెళ్లనున్నారు. అలాగే, పరిశ్రమలు, పాఠశాలలు, కళాశాలలకు సైతం వెళ్లి వైద్య పరీక్షలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈసందర్భంగా మంత్రి ఎం సుబ్రమణియన్ మాట్లాడుతూ, తమిళనాడు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలకు తోడ్పాటుగా, ప్రజా ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసే విధంగా ఈ బస్సు ద్వారా పూర్తిగా కాగిత రహితంగా డిజిటల్ సౌకర్యంతో చర్యలు తీసుకోవడాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఎంపీ తమిళచ్చి తంగపాండియన్, ఎస్‌ఆర్‌ఎం గ్రూప్ చైర్మన్ డాక్టర్ రవి పచ్చ ముత్తు, విరుగంబాక్కం ఎమ్మెల్యే ఏఎంవీ రాజా, వైద్య నిపుణులు పాల్గొన్నారు.
అన్నాడీఎంకేలోకి
‘కొంగు ఇలంజర్ పేరవై’
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే కూటమిలోకి కొంగు ఇలంజర్ పేరవై చేరబోతున్నట్లు తెలిసింది. ఇందుకు అనుగుణంగా ఆ పార్టీ నేత తనియరసు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామితో సోమవారం భేటీ అయ్యారు. ఈనెల 23న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేపట్టిన విషయం తెలిసిందే. అంతలోపు మరిన్ని పార్టీలతో చర్చలు జరిపి, అందర్నీ ఒకే వేదికపైకి తెచ్చే విధంగా బీజేపీ వ్యూహాలకు పదును పెట్టింది. ఇందుకు అనుగుణంగా బీజేపీ ఎన్‌డీఏ కూటమి తరపున అమ్మమక్కల్ మున్నేట్ర కళగం దినకరన్, మాజీ సీఎం పన్నీరు సెల్వం శిబిరాలతో చర్చలు జరుగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో ప్రేమలత విజయకాంత్ డీఎండీకేను ఆహ్వానించే కసరత్తు మొదలైనట్టు చర్చ ఊపందుకుంది.
కీలక సమావేశం
2011, 2016 ఎన్నికలలో అన్నాడీఎంకేతో కలిసి కొంగు ఇలంజర్ పేరవై పనిచేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామితో విభేదాలతో తనియరసు బయటకు వచ్చారు. గత ఏడాది సీఎం స్టాలిన్‌ను కలిశారు. డీఎంకే కూటమిలో ఆ పార్టీ చేరనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, డీఎంకే తలుపులు తెరచుకోకపోవడంతో మళ్లీ పళణిస్వామిని ప్రసన్నం చేసుకోవడం గమనార్హం. సోమవారం పళణిస్వామితో తనియరసు భేటీ సాగింది. ఈనేపథ్యంలో అన్నాడీఎంకే కూటమితో ఎన్నికలలోకి వెళ్లేందుకు తనియరసు సన్నద్ధమవుతున్నట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
యూపీఐ చెల్లింపునకు మరింత తోడ్పాటు
సాక్షి, చైన్నె: యూపీఐ చెల్లింపునకు మరింత తోడ్పాటు ఇవ్వడానికి కెనరా బ్యాంక్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఎన్‌బీఎస్‌ఎల్ ఎండీ లలిత నటరాజ్ తెలిపారు. సోమవారం కోయంబత్తూరులో ఈ విషయంగా ఆమె మాట్లాడుతూ, యూపీఐ సేవల బలోపేతం చేయడానికి ఉమ్మడి ప్రయత్నం ప్రతిబింబిస్తుందన్నారు. ఎన్‌పీసీఐ బీహెచ్‌ఐఎం సర్వీసెస్, కెనరా బ్యాంక్ మధ్య భాగస్వామ్యం కుదుర్చుకున్నామన్నారు. యూపిఐ ఫీచర్‌లను వేగంగా స్వీకరించేందుకు ఈ సహకారం మరింత మద్దతుగా ఉంటుందన్నారు.
పుదుచ్చేరి అసెంబ్లీలో గందరగోళం


