రూ. 850 కోట్లు తాగేశారు!
సాక్షి, చైన్నె : సంక్రాంతి సంబరాలలో రూ. 850 కోట్లు విలువైన మద్యాన్ని మందు బాబులు తాగేశారు. ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. కుటుంబ కార్డు దారులకు పండుగ ఖర్చుగా రూ. 3 వేలు ప్రభుత్వం ఇవ్వడంతో సమత్తువ పొంగల్ సంబరాలు జోరుగానే సాగాయి. అదే సమయంలో టాస్మాక్ మద్యం దుకాణాల ద్వారా మందుబాబులకు కావాల్సిన బ్రాండ్లను కొలువుదీర్చారు. 14వ తేదీ భోగి, 15న సంక్రాంతి రోజున పెద్దఎత్తున మద్యం అమ్మకాలు జరిగాయి. అదే సమయంలో 16వ తేదీన తిరువళ్లువర్ డే కావడంతో టాస్మాక్‌లకు సెలవు ఇచ్చేశారు. 17,18 తేదీలలోనూ మద్యం అమ్మకాలు బాగానే సాగాయి. కాగా ఈ నాలుగు రోజులలో రూ. 850 కోట్లకు మద్యం అమ్మకాలు జరిగినట్టు అధికారుల పరిశీలనలో తేలింది. గత ఏడాది కంటే ఈసారి 140 కోట్లు అధికంగా అమ్మకాలు జరిగినట్టు టాస్మాక్ వర్గాలు పేర్కొన్నాయి.


