క్లుప్తంగా
కారు ఢీకొని గర్భవతి మృతి
భర్తకు తీవ్రగాయాలు
వేలూరు: వేలూరు జిల్లా పల్లిగొండ సమీపంలోని వినాయకుడి గుడి వీధికి చెందిన దినగరన్ గత ఏడు నెలల క్రితం వానియంబాడికి చెందిన దీపిక(22)ను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం నాలుగు నెలల గర్భం దాల్చడంతో వైద్య పరీక్షలు నిర్వహిచేందుకు దీపికను బైకులో వేలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్య పరీక్షలు పూర్తి చేసుకొని తిరిగి సమయంలో వేలూరు నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొనడంతో దీపిక అక్కడిక్కడే మృతి చెందింది. దినగరన్‌కు తీవ్ర గాయాలు కావడంతో వేలూరులోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గర్భవతి అయిన దీపిక మృతి చెందడంతో బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ మేరకు పల్లిగొండ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
బావిలో పడిన జింక
సేలం: నామక్కల్ జిల్లా తిరుచెంగోడ్‌లోని ఓడువంపాలయం ప్రాంతంలో, కై లాసంపాలయం పక్కన, ఆడిటర్ సుబ్రమణ్యం యాజమాన్యంలోని వ్యవసాయ భూమి ఉంది. ఇక్కడ చాలా కాలంగా ఉపయోగంలో లేని బావి ఉంది. సోమవారం ఉదయం, అక్కడ శబ్దం విన్న ఈశ్వరి, బావిలోకి చూడగా, బావి లోపల చుక్కల జింక పడిపోయి ఉందని గుర్తించారు. గ్రామస్తులు ఈ విషయాన్ని అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వగా, సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, అగ్నిమాపక అధికారి కరికాలన్ బావి వద్దకు చేరుకుని జింకను సురక్షితంగా రక్షించి కుప్పండంపలయం పాఠశాల ఆవరణలో ఉంచి చికిత్స అందించారు.
భవిష్యత్ కార్యాచరణకు
రూ. 175 కోట్ల సేకరణ
సాక్షి, చైన్నె : అసిస్టెడ్ వెల్త్ మేనేజ్‌మెంట్ భవిష్యత్ నిర్మించేందుకు రూ. 175 కోట్లను సేకరించామని అసెట్ ప్లస్ సహ వ్యవస్థాపకులు విశ్రాంత్ సురేష్, అవనీష్ రాజ్‌లు తెలిపారు. డిజిటల్– సహాయక సంపద నిర్వహణ వేదికగా ఉన్న అసెట్ ప్లస్ , నెక్సస్ వెంచర్ భాగస్వామ్యంగా సేకరించిన నిధులు, భవిష్యత్ కార్యాచరణ వివరాలను సోమవారం స్థానికంగా వారుప్రకటలించారు. తమకు జెరోధా ద్వారా ఎయిట్ రోడ్స్ వెంచర్స్, రెయిన్ మాటర్ వంటి పెట్టుబడిదారులు కూడా మద్దతు ఇచ్చారన్నారు. మానవ సలహాలను సాంకేతికత ఆధారిత స్కేల్‌తో కలిపే విధంగా , నిర్వహణ మౌళిక సదుపాయాలను విస్తృతం చేసే దిశగా, పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని వివరించారు. టెక్నాలజీ స్టాక్‌ను మరింత పెంచేందుకు , ఉత్పత్తి విస్తరణ, సమగ్ర నిర్వహణ, ఆరోగ్యం, టర్మ్ ఫ్లాన్‌లను కవర్ చేయడం వంటి అంశాలతోపాటుగా పంపిణి దారులను ఒకే వేదిక మీదకు తెచ్చి ఆర్థిక పరిష్కారాలను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
తల్లిదండ్రుల సెల్‌ఫోన్
ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
అన్నానగర్: కడలూరు సమీపంలోని సత్తాంకుప్పం వి. కాట్టుపాళయంకు చెందిన సుకుమార్ కుమారుడు నవీన్ కుమార్ (16). ఇతను ప్లస్–1 చదువుతున్నాడు. ఆడుకోవడానికి సెల్ ఫోన్ కోసం నవీన్ కుమార్ చాలా సేపుగా తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. కానీ అతని తల్లిదండ్రులు అతనికి సెల్‌ఫోన్ ఇవ్వలేదు. దీనితో నిరాశ చెందిన నవీన్ కుమార్ 7వ తేదీన విషం తాగి స్పృహ కోల్పోయాడు. వెంటనే కుటుంబీకులు అతనిని రక్షించి చైన్నెలోని స్టాన్లీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స ఫలించకపోవడంతో ఆదివారం రాత్రి నవీన్ కుమార్ మరణించాడు. ఈ ఘటన గురించి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
చైన్నెలో శాటిలైట్ టెర్మినల్ సేవ
సాక్షి, చైన్నె: చైన్నె విమానాశ్రయంలో శాటిలైట్ ఆధారిత టెర్మినల్ సేవలు, హై లెవల్ ఫ్‌లై ఓవర్ పనులకు ఎయిర్‌పోర్టు అథారిటీ నిర్ణయించినట్టు సమాచారం. విమానాల టేకాఫ్, ల్యాండింగ్, ట్రాఫిక్ సిగ్నలింగ్ వంటి అన్నిరకాల వ్యవహారాలను శాటి లైట్ ఆధారితంగా పర్యవేక్షించే దిశగా ప్రత్యేక కార్యచరణతో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.కనెక్టివిటీని విస్తృతం చేయడానికే ఈ శాటిలైట్ టెర్మినల్ ప్రాజెక్టు చేపట్టబోతున్నట్టుగా విమానాశ్రయవర్గాలు పేర్కొంటున్నాయి. ఇది కొత్తగా నిర్మించబోతున్న విమానాశ్రయ టెర్మినల్‌కు దోహదకరంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే, భారీ వంతెన మార్గం కూడా అడయార్ నదీ తీరం వైపుగా తిర్చిదిద్ది, అత్యవసర సమయాలలో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌కు దోహద పడే విధంగా కార్యాచరణతో వెళ్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.
డ్రైవర్, కండక్టర్ సస్పెన్షన్
అన్నానగర్: కోయంబత్తూరులోని వాడవల్లి ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల ప్రయాణికుడు ప్రభుత్వ బస్సు(1ఇ)లో ప్రయాణిస్తున్నాడు. అకస్మాత్తుగా ఛాతీ నొప్పి వచ్చి కొద్దిసేపటికే మూర్ఛపోయాడు. ఆ తర్వాత కండక్టర్ ఆ ప్రయాణికుడిని మధ్యలో దింపి రోడ్డు పక్కన పడుకోబెట్టాడని తెలుస్తుంది. రాష్ట్ర రవాణా సంస్థ అధికారులు ఈ విషయంపై కండక్టర్ శరవణన్, డ్రైవర్ ఈసన్‌లతో విచారణ నిర్వహించారు. దీని తరువాత, రవాణా సంస్థ అధికారులు బస్సు డ్రైవర్, కండక్టర్‌ను సస్పెండ్ చేసి చర్యలు తీసుకున్నారు.


