కాంగ్రెస్ వేలూరు జిల్లా అధ్యక్షుడిగా వాహీద్‌బాషా
వేలూరు: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ వేలూరు జిల్లా అధ్యక్షులుగా వాహీద్‌బాషా నియామకంపై పలువురు పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను మార్పు చేస్తూ రాష్ట్ర అధిష్టానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వేలూరు జిల్లా అద్యక్షులుగా వాహీద్‌బాషా పేరును ప్రకటించడంతో వేలూరు అన్నా రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు మేళ తాలాల నడుమ టపాకాయలు పేల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు చేసుకున్నారు. అదే విధంగా కాట్పాడి యూనియన్ అద్యక్షులు సీకేజే గణేష్ అధ్యక్షతన ఆ పార్టీ కార్యకర్తలు ఇళంగోవన్, సుకుమారన్, చార్లెస్, ఇలయనల్లూరు పంచాయితి బూత్ కమిటీ అధ్యక్షులు డేవిడ్, ఆరుముగం, చంద్రబాబు, వెంకటాపురం బాలాజీ తదితరులు అభినందించారు. కొత్త కమిటీ అద్యక్షులను నియామకం చేయడంతో సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కార్యకర్తలతో నిండి పోయింది. అదే విధంగా తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై వంటి జిల్లాలకు చెందిన అద్యక్షలను నూతనంగా ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లోని కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఒక పక్క సంబరాలు చేసుకోగా మరో పక్క అసమ్మతి వర్గాలకు చెందిన కార్యకర్తలు కార్యాలయం వైపు రాకపోవడం గమనార్హం.


