మోదీ సభకు ఏర్పాట్లు ముమ్మరం
సాక్షి, చైన్నె : ప్రధాని నరేంద్ర మోదీ సభ కోసం 5 లక్షల మందిని సమీకరించేందుకు బీజేపీ వర్గాలు ఏర్పాట్లు మొదలెట్టాయి. చెంగల్పట్టు తదుపరి ఉన్న మదురాంతకంను వేదికగా జరగనున్న బహిరంగ సభ కూటమి పార్టీల పరిచయ సభగా మార్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పొత్తులు, సీట్ల ఖరారు దిశగా అన్నాడీఎంకేతో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. వివరాలు.. అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో బీజేపీ ఉన్న విషయం తెలిసిందే. అన్బుమణి పీఎంకే సైతం ఇటీవల కూటమిలో చేరింది. మరిన్ని పార్టీలు కూటమిలోకి వస్తాయని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతూ వస్తున్నాయి. అదే సమయంలో శనివారం ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టో తొలి జాబితాను సైతం పళణి స్వామి ప్రకటించారు. ఈ పరిస్థితులలో కూటమి పార్టీల నేతలందర్నీ ఒకే వేదిక పైకి తెచ్చే విధంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బహిరంగ సభకు బీజేపీ వర్గాలు కసరత్తు చేపట్టాయి. ఈనెల 23వ తేదీన ప్రధాని తమిళనాడు పర్యటనకు వస్తుండటంతో చెంగల్పట్టు తదుపరి మధురాంతకంలో బ్రహ్మాండ వేదికను ఎంపిక చేశారు. ఇక్కడ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ బహిరంగ సభకు 5 లక్షల మందిని సమీకరించే విధంగా బీజేపీ వర్గాలు కసరత్తులు చేపట్టాయి. ఈ వేదిక కూటమి పార్టీల పరిచయ బహిరంగ సభ కావడంతో అంతలోపు అన్నాడీఎంకే కూటమిలో పొత్తుల కసరత్తు, సీట్ల పందేరాన్ని కొలిక్కి తెచ్చే విధంగా కసరత్తులు మొదలయ్యాయి.
మోదీ
పొత్తులపై చర్చ
పీఎంకేకు 15 లేదా 20 లోపు సీట్లను అన్నాడీఎంకే ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే సమాచారాలు వెలువడ్డాయి. అలాగే తమిళ మానిల కాంగ్రెస్ పదికి పైగా సీట్లను ఆశిస్తోంది. ఇక ప్రేమలత విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేను తమ వైపునకు తిప్పుకునే వ్యూహాలకు పదును పెట్టారు. ఐజీకే, పుదియనిధి, పుదియ తమిళగం వంటి చిన్న పార్టీలను కలుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక, సమస్య అంతా, మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని శిబిరం, అమ్మమక్కల్‌మున్నేట్ర కళగం దినకరన్ రూపంలోనే నెలకొని ఉంది. ఈ ఇద్దర్నీ కూటమిలోకి తెచ్చేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే, అన్నాడీఎంకే నిరాకరిస్తుండటం విస్మయంలో పడేసి ఉంది. బీజేపీ ఎన్నికల కమిటీలోని త్రిమూర్తులుగా ఉన్న కేంద్రమంత్రులు ఆదివారం కూడా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో ఈ వ్యవహారం గురించి ఢిల్లీ నుంచి చర్చించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. దినకరన్‌ను ఎన్‌డీఏ కూటమిలోకి చేర్చుకునేందుకు మొగ్గు చూపినా, బీజేపీకి సీట్ల వ్యవహారంలో కోత విధిస్తామంటూ అన్నడీఎంకే మెళిక పెట్టిన ట్లు తెలిసింది. కాగా మోదీ సభ రోజున అన్ని పార్టీల నేతలూ ఒకే వేదికపై కనిపిస్తారా..? అనే అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నట్లు తెలిసింది.


