నిఘానీడలో.. విమానాశ్రయాలు
సాక్షి, చైన్నె: గణతంత్ర వేడుకల నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన ఆదేశాలతో చైన్నెలోని మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఐదు అంచెల భద్రతతో నిఘా నీడలోకి తీసుకొచ్చారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి ప్రయాణీకుడ్ని, విమానాల్ని తనిఖీ చేసినానంతరం టేకాఫ్‌కు అనుమతి ఇస్తున్నారు. వివరాలు.. రాష్ట్ర రాజధాని నగరం చైన్నె తీవ్ర వాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న దృష్ట్యా, పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తోంది. కేంద్రం నుంచి, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చే సమాచారాలతో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంగా రాష్ట్రంలో వెలుగు చూస్తున్న పరిణామాలు భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. సంఘ విద్రోహ శక్తుల కార్యకలాపాలను ఎన్‌ఐఏ గుర్తిస్తూ రావడంతో కలవరం తప్పడం లేదు. ఈ పరిస్థితులలో గణతంత్ర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా భద్రత కట్టుదిట్టం చేసే విధంగా కేంద్రనిఘా వర్గాల నుంచి ఆదివారం ఆదేశాలు అందాయి.
భద్రత కట్టుదిట్టం..
రాష్ట్రంలోని చైన్నె మీనంబాక్కం విమానాశ్రయం అతిపెద్దది. ఇటీవలే సరికొత్త హంగులతో ఈ విమానాశ్రయం రూపు రేఖల్ని మార్చారు. జాతీయ, అంతర్జాతీయ విమానాలకు వేదికగా ఉన్న ఇక్కడ భద్రత ఎప్పుడు కట్టుదిట్టంగానే ఉంటూ వస్తున్నది. అయితే, కేంద్రం నుంచి ఏదేని హెచ్చరికలు వచ్చిన పక్షంలో మాత్రం నిఘాను మరింత పెంచుతుంటారు. ఆ దిశగా విమానాశ్రయం పరిసరాల్ని ఆదివారం నుంచి నిఘా నీడలోకి తెచ్చారు. అక్కడి నిఘా నేత్రాల ద్వారా కంట్రోల్ రూంల నుంచి ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తూ వస్తున్నారు. అలాగే, కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీసులు తనిఖీల్లో నిమగ్నం అయ్యాయి. ప్రతి విమానాన్ని, ప్రయాణీకుల్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయంలోకి వచ్చే వాహనాలకు ఆంక్షలు విధించారు. తనిఖీల అనంతరం లోనికి అనుమతిస్తున్నారు. ఇక, సందర్శకుల అనుమతికి ఈనెలాఖరు వరకు బ్రేక్ వేశారు. చైన్నె మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటుగా, మదురై, తిరుచ్చి, కోయంబత్తూర్, తూత్తుకుడి, సేలం విమానాశ్రయాల్లోను భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో చైన్నెలో జరిగే గణతంత్ర వేడుకల రిహార్సల్స్‌కు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఈనెల 21,23 తేదీలలో కామరాజర్ సాలైలలో రిహార్సల్స్ జరగనున్నాయి. ఈ దృష్ట్యా, ఆపరిసర మార్గాలలో ట్రాఫిక్ మార్పులు చేస్తూ చర్యలు తీసుకున్నారు.
నిఘానీడలో.. విమానాశ్రయాలు


