కవిన్‌తో చేయి కలిపిన శాండీ మాస్టర్
తమిళసినిమా: నటుడు కవిన్, నటి ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్న నూతన చిత్రాన్ని థింక్ స్టూడియోస్ పతాకంపై స్వరూప్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రంలో శాండీ మాస్టర్ వచ్చి చేరారు. కవిన్, శాండీ మాస్టర్ ఇంతకుముందు బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో పాల్గొని అలరించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా వీరిద్దరు కలిసి సినిమాలో నటిస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి కెన్ రాయ్‌సన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది ఫాంటసీ నేపథ్యంలో సాగే వినోదభరిత కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రంలో శాండీ మాస్టర్ నటిస్తున విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియోను యూనిట్ వర్గాలు విడుదల చేశారు. అందులో చిందరవందరగా ఉన్న ఒక ఆఫీస్ గదిలో కెమెరా స్లోగా మూవ్ అవుతూ నటి ప్రియాంక మోహన్‌పై జూమ్ అవుతుంది. ఆ తరువాత మోడరన్ దుస్తులు ధరించి ఉన్న నటుడు కవిన్, శాండీ మాస్టర్ కనిపించే విధంగా చిత్రీకరించిన ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా నటుడు కవిన్, నటి ప్రియాంక మోహన్ కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇది అన్నది గమనార్హం. ఫాంటసి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ కథా చిత్రానికి ఓఫ్రో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించినట్లు చిత్ర వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


