తై అమావాస్య రద్దీ
తిరువొత్తియూరు: తై అమావాస్యను పురస్కరించుకుని ప్రజలు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాల వద్ద ఆదివారం ప్రజలు పవిత్ర స్నానాలు చేసి తమ పూర్వీకులకు తర్పణాలిచ్చారు. వివరాలు.. తై, ఆడి, పురటాసి వంటి మాసాలలో వచ్చే అమావాస్య రోజుల్లో ప్రజలు తమ పూర్వీకులకు నీళ్లలో తర్పణం ఇవ్వడం ఆచారం. దీనివల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని జనం నమ్మకం. కాగా ఈ సంవత్సరం తొలి తై అమావాస్య ఆదివారం 18వ తేదీ ఆదివారం వచ్చింది. అర్ధరాత్రి 2.31 వరకు అమావాస్య గడియలు కొనసాగాయని పండితులు తెలిపారు.
రామేశ్వరంలో..
తై అమావాస్య సందర్భంగా రామేశ్వరంలో భక్తులు కిక్కిరిసిపోయారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామేశ్వరం శ్రీ రామనాథస్వామి ఆలయం వద్ద ఈ రోజు తై అమావాస్య కావడంతో లక్షలాది మంది భక్తులు అగ్ని తీర్థం సముద్రంలో స్నానం చేసి, తమ పూర్వీకులకు తిథి తర్పణాలు ఇచ్చి, ఆవులకు , యాచకులకు అన్నదానం చేశారు. ఆలయం లోపల ఉన్న 22 పవిత్రమైన తీర్థాలలో స్నానం చేసి, ఆ తర్వాత చాలా సేపు క్యూలో నిలబడి స్వామి దర్శనం చేసుకున్నారు ఇక్కడ భద్రత కోసం 900 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహించారు.
తిరుచెందూర్‌లో..
మహాలయ అమావాస్యను పురస్కరించుకుని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సముద్ర తీరంలో పెద్ద సంఖ్యలో భక్తులు తమ పూర్వీకులకు తర్పణాలు సమర్పించారు. అమావాస్య కావడంతో తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని తెల్లవారుజామున మార్తాండ అభిషేకం నిర్వహించారు. మహాలయ అమావాస్యను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు సముద్ర తీరానికి చేరుకున్నారు. తమ పూర్వీకులకు పిండాలు పెట్టి, నువ్వుల నీరు వదిలి తర్పణం ఇచ్చి, సముద్రంలో పవిత్ర స్నానం చేసి స్వామి దర్శనం చేసుకున్నారు.
తిరుచ్చి, తిరువరంగంలో..
తిరుచ్చి తిరువరంగం అమ్మామండపంలో పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడారు. వారు తమ వంశం అభివద్ధి చెందాలని, పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని తర్పణం ఇచ్చి నదిలో పిండాలు కలిపి పూజలు చేశారు. దీని కోసం, తిరువరంగం అమ్మ మండపంలో 100 మందికి పైగా శివాచార్యులు, పురోహితులు తర్పణం ఇచ్చేవారందరినీ మండపపు ఒడ్డున కూర్చో బెట్టి తర్పణాలు ఇచ్చే కార్యక్రమం నిర్వహించారు. అలాగే తిరుచ్చి పడితురై, ఓడతురై, తిల్లైనాయకం పడితురై, ముక్కొంబుతో సహా పలు ఇతర ప్రదేశాలలో కూడా తై అమావాస్య సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తమ పూర్వీకుల జ్ఞాపకార్థం తర్పణం ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తిరువరంగం రంగనాథర్ కోవెల, తిరువానైక్కావల్ జంబుకేశ్వరర్ అఖిలాండేశ్వరి కోవెల, సమయపురం మారియమ్మన్ కోవెలకు వెళ్లి స్వామివార్లను దర్శించుకున్నారు.
వీరరాఘవుని ఆలయానికి పోటెత్తిన భక్తులు
తిరువళ్లూరు: తై అమావాస్య పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ వైద్యవీరరాఘవుని ఆలయానికి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పితృదేవతలకు పిండ ప్రదానం చేసి స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులు చేసిన గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారు మోగింది. ఆదివారం తై అమావాస్య కావడంతో శనివారం రాత్రి నుంచే పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని వీరరాఘవుని ఆలయం ప్రాంగణం వద్ద జాగారం చేశారు. అనంతరం ఆదివారం పుణ్యస్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానం చేయడంతోపాటు పుష్కరిణిలో పాలు, బెల్లం చల్లి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రత్నాంగి సేవలో శ్రీదేవి భూదేవిలతో కలసి దర్శనమిచ్చిన స్వామి వారిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం వద్ద రద్దీ ఎక్కువగా కనిపించింది. ఐదు గంటల పాటు క్యూలో వేచిన భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆలయానికి వేలాది మంది భక్తులు రావడంతో రద్దీగా మారింది. భక్తుల రద్దీతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆలయ ప్రాంగణంలో రోటరీ సంఘం సహా పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానంతో పాటు వైద్యశిబిరాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
తై అమావాస్య రద్దీ


