క్లుప్తంగా
హొసూర్ విమానాశ్రయ
ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేం
– కేంద్రం స్పష్టీకరణ
కొరుక్కుపేట: హొసూర్ ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణానికి గగనతల అనుమతి ఇవ్వలేమని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కృష్ణగిరి జిల్లాలోని హొసూర్ నగరం పారిశ్రామిక అభివృద్ధిలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. దాని మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ విషయంలో చేసిన ప్రకటన నుండి కొంగు ప్రాంతంలో భారీ అంచనాలు ఉన్నాయి. స్థల ఎంపిక, భారత విమానాశ్రయ క్షేత్రస్థాయి సర్వే, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సమస్య పరిష్కార ప్రాంతం, కేంద్ర పౌర విమానయానం తమిళనాడు ప్రభుత్వం పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందడం సహా వివిధ దశల కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హోసూర్ ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు గగనతల అనుమతి ఇవ్వలేమని రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టం చేసింది. హొసూర్ చుట్టూ ఉన్న గగనతలం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) నియంత్రణలో ఉందని, సైనిక , ప్రయోగాత్మక విమానాలకు అక్కడ ఎగురుతున్న నేపథ్యంలో ప్రయాణికుల విమానాలకు అనుమతి ఇవ్వలేమని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ లేఖలో పేర్కొంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం తర్వాత దశను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
చోరీ కేసులో నలుగురి అరెస్ట్
అన్నానగర్: రూ.60లక్షలు విలువ చేసే విగ్గులను చోరీ చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చైన్నె, మనలిలోని విచూర్ గ్రామంలో ఒక ప్రైవేట్ కంపెనీ మనిషి వెంట్రుకలను ఉపయోగించి విగ్గులు, టోపాలు, సౌందర్య సాధనాలను తయారు చేసి విదేశాలకు పంపిస్తుంటుంది. ఈనెల 5వ తేదీన కంపెనీ షట్టర్‌ను పగులగొట్టి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉంచిన జౌరి వెంట్రుకలతో చేసిన సౌందర్య సాధనాలను దుండగులు చోరీ చేశారు. ఫిర్యాదు మేరకు మనలి న్యూ టౌన్ పోలీసులు కంపెనీలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. విచారణలో చోరీకి పాల్పడిన చైన్నె రెడ్ హీల్స్ ఎం.జీ.ఆర్ నగర్‌కు చెందిన పృథ్వీరాజ్ (38), సురేందర్ (35), గుమ్మిడిపూండి శ్రీలంక శరణార్థి శిబిరానికి చెందిన ఆండ్రో సెల్వకుమార్ (40), రాజ్‌కుమార్ (37)లను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. రెడ్‌హీల్స్ ప్రాంతంలోని ఒక ఇంట్లో జౌరివెంట్రుకలతో తయారు చేసిన సౌందర్య ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్న యజమానికి విక్రయించేందుకు చోరీ చేసి వారు దాచిపెట్టినట్లు తెలిసింది. పోలీసులు అక్కడికి వెళ్లి జౌరి వెంట్రుకలను, ఒక లగ్జరీ కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నలుగురిని కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు.
బైక్‌లో మద్యం బాటిళ్లు
–ఒకరి అరెస్ట్
తిరుత్తణి: బైకులో మద్యం బాటిళ్లు తరలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కనకమ్మసత్రం సమీపం చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలో ఆర్కేపేట మద్యపాన నిషేధిత విభాగ పోలీసులు ఆదివారం ఉదయం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బైకులో తిరువళ్లూరు వైపు వెళుతున్న బైకును ఆపి అందులో తనిఖీ చేశారు. తనిఖీల్లో బైకులో మద్యం బాటిళ్లు ఉన్నట్టు గుర్తించి బైకును స్వాధీనం చేసుకుని వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణలో పూండి మండలంలోని మేట్టుపాళ్యం గ్రామానికి చెందిన సతీష్(45) అనే వ్యక్తి కనకమ్మసత్రం టాస్మాక్ మద్యం దకాణంలో మద్యం కొనుగోలు చేసి అక్రమంగా తరలించి ఇంట్లో వుంచి అదనపు ధరలకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు గుర్తించి సతీష్‌ను అరెస్టు చేసారు.
తల్లీకూతురు ఆత్మహత్య
తిరువొత్తియూరు: తిరుకలుకుండ్రం ఈచ్చంకరనై గ్రామానికి చెందిన గీత(37). గీతకు వాలాజాబాద్, అగరం ప్రాంతానికి చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరి కుమార్తె శుభశ్రీ (8) 3వ తరగతి చదువుతోంది. దంపతుల మధ్య విభేదాల కారణంగా విడిపోయారు. గీత కుమార్తెతో కలసి ఈచ్చంకరనైలోని పుట్టింట్లో వుంటున్నారు. గీత చైన్నె నుంగంబాక్కంలో గది అద్దెకు తీసుకుని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. వారాంతంలో తండ్రి, కుమార్తెను కలవడానికి ఈచ్చంకరనై గ్రామానికి వచ్చి వెళుతుంటుంది. పొంగల్ సెలవులు రావడంతో గీత ఈచ్చంకరనై గ్రామానికి వచ్చి కుమార్తె, తండ్రితో ఉంది. శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న గీత, ఆమె కుమార్తె శుభశ్రీ అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. ఆదివారం ఉదయం ఇంటికి సమీపంలోని బావిలో గీత, శుభశ్రీ మృతదేహాలు కనిపించాయి. స్థానికులు తిరుకలుకుండ్రం పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి మృతదేహాలను బావిలో నుంచి వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆలయ గేట్లకు తాళంతో కలకలం
పళ్లిపట్టు: నొచ్చిలిలోని గంగాధరేశ్వరర్ ఆలయ ఉత్సవర్లు గ్రామ వీధుల్లో ఊరేగింపు సందర్భంగా కొందరు ఆలయ ప్రధాన ద్వారం గేట్లు మూసి తాళం వేయడంతో కలకలం రేపింది. ఓ వర్గం ఉండే ప్రాంతంలోకి మొదట తీసుకెళ్లడంతో మరో వర్గం ఈ చర్యకు పాల్పడింది. దీనిపై కొందరు తిరుత్తణి ఏఎస్పీ కార్యాలయంలో దివారం ఫిర్యాదు చేశారు.


