కోలాహలం ముక్కనుమ వేడుకలు
పళ్లిపట్టు: ముక్కనుమ సందర్భంగా శనివారం సాయంత్రం కల్యాణ రామర్ స్వామి పట్టణ వీధుల్లో విహరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. పళ్లిపట్టు ఆంజనేయనగర్‌లోని కల్యాణరామర్, వీరమంగళ ఆంజనేయర్ ఆలయంలో ముక్కనుమ సందర్భంగా శనివారం ఉదయం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం కల్యాణరాముడికి ప్రత్యేక అలంకరణ చేసి పట్టణ వీధుల్లో వాహనంలో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో స్వామికి కర్పూర హారతులిచ్చి, కొబ్బరికాయలు కొట్టి స్వామి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు డీఎంకే నేత పద్మనాభం, వార్డు కౌన్సిలర్ జయలక్ష్మి అన్నదానం చేశారు. ఉత్సవర్ల ఊరేగింపు ఉభయదారులుగా వెంకటాచలపతి, హేమాద్రి, గుణశీలన్ కుటుంబీకులు వ్యవహరించారు.
చీరకు నిప్పు అంటుకుని
వృద్ధురాలు మృతి
అన్నానగర్: కోడంబాక్కంలోని భారతీశ్వర ఆలయంలో దీపం వెలిగిస్తున్నప్పుడు చీరకు మంటలు అంటుకుని ఓ వృద్ధురాలు మరణించారు. వివరాలు.. చైన్నెలోని కోడంబాక్కం భారతీశ్వరర్ 5వ వీధికి చెందిన శాంతి (70). ఆమె తన కుటుంబంతో కలిసి నివసించే వారు. శాంతి సాధారణంగా తన ఇంటికి సమీపంలోని భారతీశ్వరర్ శివాలయంలో దీపాలు వెలిగిస్తుంది. దాని ప్రకారం, శనివారం ఆమె తన బంధువు జయంతితో కలిసి ఆలయానికి వచ్చి దీపం వెలిగించింది. అప్పుడు ఊహించని విధంగా, శాంతి చీరకు మంటలు అంటుకుని మరణించారు. వడపళని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రేషన్ గోడౌన్ సిబ్బంది నిరసన
తిరుత్తణి: రేషన్ గోడౌన్ సిబ్బంది తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆదివారం మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. తిరుత్తణిలోని రేషన్ గోడౌన్‌లో 40 మంది రేషన్ బస్తాలు మోసే సిబ్బంది ఉన్నారు. సిబ్బందికి ఉద్యోగ భద్రత, పదేళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి గ్రీన్ కార్డులు ఇవ్వాలని, తమ సంఘం ఎన్నికలు నిర్వహించాలని, కూలీ పెంచాలనే గోడౌన్ ముందు రేషన్ బస్తాలు మోసే సిబ్బంది నిరసన తెలిపారు.
పెట్రోల్ బాంబు దాడి
– ఐదుగురికి తీవ్రగాయాలు
అన్నానగర్: పొంగల్ క్రీడా ఉత్సవంలో విసిరిన పెట్రో బాంబ్ దాడి ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తిరువణ్ణామలై జిల్లాలోని సెయ్యర్ సమీపం పెరుంపాలై గ్రామంలో శనివారం పొంగల్ పండుగ సందర్భంగా పిల్లలకు క్రీడా పోటీలు జరిగాయి. పోటీల్లో తెన్ తండలం తిరువళ్లువర్ వీధికి చెందిన బాలాజి (28), అక్కడే ఉన్న హరికష్ణన్, అలాడియన్‌లతో వాగ్వాదానికి దిగాడు. అక్కడ ఉన్న వారు బాలాజీని మందలించి పంపించేశారు. ఈవిషయాన్ని గ్రామస్తులు బాలాజీ తండ్రి కార్తికేయన్ వద్దకు వెళ్లి, బాలాజీపై ఫిర్యాదు చేశారు. ఇది చూసి ఆగ్రహించిన బాలాజీ ఫిర్యాదు చేసిన వ్యక్తులపై పెట్రో బాంబు విసిరాడు. పెట్రో బాంబ్ పేలి శరవణన్ (28), వసంత (60), ప్రవీణ్ కుమార్ (27), విజయకుమార్ (24), శరత్ కుమార్ (24) మంటల్లో చిక్కుకున్నారు. స్థానికులు మంటలను ఆర్పారు. ఘటనలో గాయపడిన వారిని సెయ్యార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో చేర్చారు. పోలీసులు బాలాజీని అరెస్టు చేశారు.
కొబ్బరి వ్యాపారి దారుణ హత్య
తిరువొత్తియూరు: సెంజి సమీపంలో తలపై రాయి వేసి కొబ్బరి వ్యాపారిని దారుణంగా హత్య చేశారు.. దీనికి సంబంధించి స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సెంజి తిరువణ్ణామలై రోడ్డులో వళుక్కాంపారైకు చెందిన శక్తివేల్ (25) కొబ్బరి వ్యాపారి. శనివారం కనుమ పొంగల్ కావడంతో స్నేహితులతో కలసి అదే ప్రాంతంలోని కొండపై మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆగ్రహించిన స్నేహితులు శక్తివేల్ తలపై రాయి వేసి పారిపోయారు. రక్తపు మడుగులో పడివున్న శక్తివేల్‌ను చూసిన బంధువు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి శక్తివేల్‌ను సెంజి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మృతిచెందాడని నిర్ధారించారు. ఆప్రాంతానికి చెందిన తిరుమలై (25)ను పోలీసులు అరెస్టు చేశారు.
కోలాహలం ముక్కనుమ వేడుకలు


