గప్.. చుప్!
సాక్షి, చైన్నె: తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ శ్రమించాలే గానీ, ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయ వద్దని టీఎన్‌సీసీ నేతలు ఏఐసీసీ పెద్దలు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. డీఎంకేతో మిత్ర బంధం కొనసాగాలే గానీ, ఎవరికి వారు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదన్న హెచ్చరికలను చేసినట్టు చర్చ ఊపందుకుంది. డీఎంకే, కాంగ్రెస్‌ల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. అయితే, కాంగ్రెస్ నేతలు ఇటీవల కాలంగా ఎవరికి వారు చేస్తూ వస్తున్న వ్యాఖ్యలు డీఎంకేలో ఆగ్రహాన్ని రేపుతూ వస్తున్నాయి. కొందరు నేతలు అయితే, అధికారంలో వాటా ఇవ్వాల్సిందేనని బహిరంగంగా స్పందిస్తూ రావడం, దీనికి దీటుగా డీఎంకే నేతలు ఒకరిద్దరు పరోక్షంగా స్పందించడం జరుగుతూ వస్తోంది. అదే సమయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకేతో పొత్తు ప్రయత్నాలలో సైతం కాంగ్రెస్ ఉన్నట్టుగా వెలువడ్డ సమాచారాలు డీఎంకేకు పుండు మీద కారం చల్లినట్టుగా మారింది. కాంగ్రెస్ బయటకు వెళ్లినా తమకు ఢోకా లేదన్నట్టుగా ఓ మంత్రి సైతం స్పందించడం గమనార్హం. ఈ పరిణామాల నేపథయలో టీఎన్‌సీసీ నేతలు,ఎన్నికల ఇన్‌చార్జ్ నేతృత్వంలోని కమిటీని ఢిల్లీకి ఏఐసీసీ పిలిపించింది.
బహిరంగ వ్యాఖ్యలు వద్దు
ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ రాష్ట్ర నేతలు, ఎన్నికల వ్యవహారాల కమిటీ నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో శని, ఆదివారాలలో భేటీ అయ్యారు. తమిళనాడులో డీఎంకే బలం, ప్రధానంగా సీఎం స్టాలిన్‌తో ఉన్న స్నేహ బంధం గురించి రాష్ట్ర నేతలుకు జాతీయ నేతలు క్లాస్ తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. డీఎంకేతో సీట్ల పందేరం అన్నది సజావుగా సాగాలే గానీ, ఇష్టానుసారంగా, బహిరంగంగా వ్యాఖ్యలుచేసే వరకు వెళ్ల కూడదని నేతలకు ఏఐసీసీ పెద్దలు హుకుం జారీ చేసినట్టు సమాచారం. డీఎంకే ఇచ్చే సీట్లను సర్దుకోవాలని, అధికారంలో వాటా అన్న నినాదం ఇక తెర మీదకు రాకూడదన్న హెచ్చరికలు చేసినట్టు సమాచారం. మరికొన్ని తీవ్ర హెచ్చరికలు చేస్తూనే, తమిళనాడులోమళ్లీ డీఎంకే అధికారంలోకి రావాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ శ్రమించాలని, ఎవరికి వారు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పదన్న హెచ్చరికలను రాహుల్ ప్రత్యేకంగా చేసినట్టు సమాచారం వెలువడింది. రెండు రోజుల క్రితం నీలగిరి పర్యటనకు వచ్చిన రాహుల్‌తో డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎ. రాజ భేటీ కావడం, ఆ తదుపరి పరిణామాలతో ఇక్కడి నుంచి కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లడం గమనార్హం.


