వైభవం..పార్వేట ఉత్సవం
తిరువళ్లూరు: ప్రతి ఏటా కనుమ పండుగ రోజు పేరంబాక్కంలో జరిగే పార్వేట ఉత్సవం శనివారం రాత్రి వైభవంగా జరిగింది. పేరంబాక్కంలో బస్టాండు వద్ద ఐదు గ్రామాలకు చెందిన 10 ఉత్సవమూర్తులు ఒకే ప్రాంతంలో కొలువదీరి భక్తులకు దర్శనమివ్వడంతో వేలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం తరలివచ్చారు. తిరువళ్లూరు జిల్లా పేరంబాక్కంలో కనుమ పండుగలో భాగంగా శనివారం రాత్రి పార్వేట ఉత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవాలకు పేరంబాక్కం నుంచి కామాక్షి సమేత సోలీశ్వరుడు, బాలమురుగన్, కళాంబాక్కం నుంచి మరగదవల్లి అమ్మవారు, తిరునాగేశ్వరర్, నర్సింగాపురం నుంచి వళ్లి సమేత మురుగన్, శివపురం నుంచి వినాయకుడు, వళ్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, మారిమంగళం నుంచి శివమారి నారాయణి ఉత్సవ మూర్తులు పేరంబాక్కం బస్టాండు వద్ద ఒకే చోట దర్శనమిచ్చారు. ఒకే ప్రాంతంలో 10 ఉత్సవమూర్తులు దర్శనమివ్వడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామి వార్లను దర్శించుకున్నారు. ఉత్సవం అనంతరం ఉత్సవమూర్తులను గ్రామాలకు ఊరేగింపుగా తిరిగి వెళ్లారు.


