తిరుగు ప్రయాణం రద్దీ
సాక్షి, చైన్నె: సంక్రాంతి పండుగను ముగించుకుని స్వస్థలాల నుంచి జనం చైన్నె వైపుగా తిరుగు పయనం అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచే జాతీయ రహదారి, రాష్ట్ర రహదారుల్లోని టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఏ రోడ్డు చూసినా వాహనాలతో కిట కిటలాడటంతో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. వివరాలు.. చైన్నెలో ఉద్యోగ, వివిధ పనులు నిమిత్తం నివాసం ఉంటున్న వాళ్లందరూ, ఇక్కడి విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు వివిధ సంస్థల్లో పనిచేస్తున్న యువత సంక్రాంతి పర్వదినాన్ని తమ కుటుంబాలతో జరుపుకునేందుకు స్వస్థలాలు, స్వగ్రామాలకు బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఈసారి ఏకంగా పండుగకు సెలవులు మరీ ఎక్కువే. అధికారికంగా నాలుగు రోజులే సెలవులైనప్పటికీ, ముందు, వెనుక వచ్చిన శని, ఆదివారాలు కలిసి రావడంతో ఇంటిళ్లిపాది పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు స్వ స్థలాలకు వెళ్లారు. చైన్నె నుంచి సుమారు 10 లక్షలమందికి పైగా స్వస్థలాలకు వెళ్లినట్టు గణాంకాలు చెబుతున్నాయి,. బస్సులు, సొంత వాహనాలు, రైళ్లల్లో వెళ్లిన వారే అధికం. వీరంతా పండుగను ముగించుకుని మళ్లీ చైన్నె వైపుగా తిరుగు పయనం అయ్యేపనిలో పడ్డారు. దీంతో కన్యాకుమారి – మదురై– తిరుచ్చి – విల్లుపురం – చైన్నె జాతీయ రహదారి, విల్లుపురం– కడలూరు– తంజావూరు రహదారి, దిండివనం – సేలం – కోయంబత్తూరు రహదారి అంటూ, అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిశాయి. ప్రైవేటు వాహనాలతో టోల్ గేట్ల వద్ద రద్దీ నెలకొంది.
చైన్నె శివార్లలో..
ఇక అర్ధరాత్రి నుంచే చైన్నె శివారులలోని మార్గాలలో ట్రాఫిక్ రద్దీమరి ఎక్కువ అయింది. ఇక, సోమవారం విధులకు వెళ్లాల్సి ఉండడంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి చైన్నె వైపుగా ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు కదిలాయి. అన్ని టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులుదీరాయి. దక్షిణ తమిళనాడు, కొంగు మండలంలోని జిల్లాల వైపుగా ఉన్న మార్గాలలో ఎటు చూసినా బస్సులు, సొంత వాహనాలు, ద్విచక్ర వాహనాల రద్దీ అధికంగా ఉండటం గమనార్హం. ఈ వాహనాలన్ని సోమవారం వేకువ జాము నుంచి చైన్నెలోకి ప్రవేశించాయి. చెంగల్పట్టు సమీపంలోని పరనూరు టోల్ గేట్ వద్ద వాహన రద్దీని కట్టడి చేసే విధంగా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులను కిలాంబాక్కంకు పరిమితం చేశారు. ఇక్కడి నుంచి జనం తమ తమప్రాంతాలకు ఎలక్ట్రిక్ రైళ్లను ఆశ్రయించి వెళ్లేందుకు వీలుగా చెంగల్పట్టు, కాటన్ కొళత్తూరు, గుడువాంజేరిల నుంచి తాంబరం వైపుగా సోమవారం వేకువ జాము నుంచే అదనపు రైళ్ల సేవలకు చర్యలు తీసుకున్నారు కిలాంబాక్కం బస్టాండ్ పరిసరాలు వాహనాలో నిండాయి. కోయంబేడు,మాధవరం వైపుగా వెళ్లాల్సిన బస్సులను, సొంత వాహనాలను పెరుంగళత్తూరు బైపాస్ మీదుగా అనుమతించారు. ఈ మార్గాలో కిలో మీటర్ల కొద్ది వాహనాలు బారులు తీరకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భారీ కంటైనర్, ఇతర లారీ వంటి వాహనాలను చైన్నె వైపుగా ఆదివారం అర్ధరాత్రి నుంచే అనుమతించలేదు. ఇక చైన్నె వైపుగా వచ్చే అన్ని రైళ్లు కిటకిటలాడాయి. ఈ రద్దీ ప్రభావం సోమవారం ఉదయం చైన్నె నగరం మీద పడకుండా ముందు జాగ్రత్తలతో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది.


