అదరహో
అలంగానల్లూరు..
వాడివాసల్ నుంచి దూసుకొస్తున్న ఎద్దు
సాక్షి, చైన్నె: తమిళుల వీరత్వాన్ని, సాహసాన్ని చాటే క్రీడ జల్లికట్టుకు మదురై జిల్లా ప్రసిద్ధి గాంచిన విషయం తెలిసిందే. సంక్రాంతి వేళ ఇక్కడి అవనియాపురంలో, కనుమ వేళ పాలమేడులో జల్లికట్టు ఉత్కంఠగా జరిగింది. కానం పొంగళ్ వేల ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన అలంగానల్లూరులో జల్లికట్టు హోరెత్తింది. ఉదయం అలంగానల్లూరులోని మునియాండి స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ఎద్దులతో కలిసి వాడివాసల్ మైదానం వైపుగా గ్రామ పెద్దలు, నిర్వాహకులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు తరలి వచ్చారు. అప్పటికే ప్రేక్షకుల గ్యాలరీలో జల్లికట్టును వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్లంతా కొలువు దీరారు.
బుసలు కొట్టిన బసవన్నలు
మదురై జిల్లా అలంగానల్లూరు జల్లి కట్టు కట్టుదిట్టమైన భద్రత, ఆంక్షలు , నిఘా నీడలో జరిగింది. తేని, దిండుగల్, మదురై, శివగంౖగై, విరుదు నగర్, తిరుచ్చి, రామనాథపురం, తూత్తుకుడి, తంజావూరు, పుదుకోట్టై జిల్లాల నుంచి పేరు మోసిన రైతులు, ప్రజా ప్రతినిధులకు చెందిన కొమ్ములు తిరిగిన 1,137 ఎద్దులు కదనరంగంలో వాడివాసల్ నుంచి బయటకు దూసుకొచ్చాయి. తొలుత మునియాండి స్వామి ఆలయ ఎద్దును వదలగా దానిని పట్టుకునేందుకు 900 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. అనంతరం ఒక దాని తర్వాత మరొకటి చొప్పున వచ్చిన ఎద్దులు దూకుడుగా ముందుకు సాగాయి. తామేమీ తక్కువ తిన్నామా...? అన్నట్టు క్రీడాకారులు వాటిని పట్టుకునేందుకు దూసుకొచ్చారు. అనేక మంది విజయ కేతనం ఎగుర వేయగా, మరి కొందరు గాయాల పాలయ్యారు. కొన్ని ఎద్దులు తమ పౌరుషాన్ని చాటుకుంటూ క్రీడా కారుల చేతికి చిక్కకుండా ఉడాయించి అదర గొట్టాయి. ఇంకొన్ని క్రీడాకారులతో తలబడే విధంగా ఢీకొట్టి బహుమతుల్ని తన్నుకెళ్లాయి. ఒక ఎద్దును తలదన్నే రీతిలో మరో ఎద్దు అన్నట్టుగా బుసలు కొడుతూ బసవన్నలు పోటీలో దూసుకు రావడంతో అలంగానల్లూరు ఉత్కంఠ భరితంగా జల్లికట్టు జరిగింది. కొన్ని ఎద్దులు క్రీడా కారుల్ని బెంబెళెత్తించే రీతిలో వారి వైపుగా దూసుకెళ్లడం వంటి ఉత్కంఠ ఘట్టాల్ని విదేశీయులు సైతం ఆసక్తిగా తిలకించారు. బంగారు ఉంగరాలు, నాణేలు, వెండి వస్తువులు, సైకిళ్లు, మోటారు సైకిళ్లు, సెల్‌ఫోన్‌లు, బిందెలు, వాషింగ్ మిషన్‌లు, బీరువాలు, మంచాలు, ఎల్‌ఈడీ టీవీలు, ఏసీ, ఫ్యాన్లు, సైకిళ్లు, వంటి ఆకర్షణీయమైన బహుమతుల్ని విజేతలకు అందజేశారు. తమ పెంపుడు ఎద్దులతో వచ్చిన కొందరు యువతులు, బాలికలు విజయ కేతనం ఎగుర వేసి బహుమతులను పట్టుకెళ్లారు. ఈ పర్యాయం కూడా ఎక్కువగా క్రీడాకారులతో పాటూ బసవన్నలు బహుమతుల్ని తన్నుకెళ్లాయి. బసులు కొట్టే బసవన్నలు కొన్నింటిని క్రీడాకారులు పట్టుకోగా, మరికొన్ని వారి చేతికి చిక్కకుండా బహుమతుల్ని దక్కించుకున్నాయి. ఉదయం నుంచి నువ్వా..నేనా అన్నట్టుగా జరిగిన అలంగానల్లూరు జల్లికట్టు సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. చివర్లో ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరిచిన కార్తీక్ అనే క్రీడాకారుడికి కారును, ఎద్దు యజమాని పుదుకోట్టైకి చెందిన ఏవీఎం బాబుకి ట్రాక్టర్‌ను బహుమతిగా అందజేశారు. ఇక, శివగంగ జిల్లా కారైక్కుడి సమీపంలోని సిరువాయిల్ గ్రామంలో మంజువిరాట్ హోరెత్తింది. అలాగే తిరుచ్చి జిల్లామనప్పారైలోనూ జల్లి కట్టు లో ఎద్దులు బసులు కొట్టగా, క్రీడాకారులు పౌరుషాన్ని చాటారు.
ఉద్యోగాల్లో ప్రాధాన్యత
అలంగానల్లూరులో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, ఇక్కడ నిర్మిస్తున్న బ్రహ్మాండ జల్లికట్టు స్టేడియం గురించి ప్రస్తావించారు. ఇందుకోసం రూ.62 కోట్లు కేటాయించామని వివరించారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలు, జల్లికుట్ట వీరత్వాన్ని గుర్తు చేస్తూ, రెండు ప్రకటనలు చేశారు. ఇందులో ఒకటి జల్లికట్టులో రాణించే క్రీడాకారులకు పశుసంవర్థక శాఖ ఉద్యోగాలలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు. మరొకటి అలంగానల్లూరులో జల్లికట్టు ఎద్దులకు శిక్షణతో పాటూ మెరుగైన వైద్యం అందించేందుకు వీలుగా రూ. 2 కోట్లతో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనున్నామని వివరించారు. కార్యక్రమంలో మంత్రులు నెహ్రూ, కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసను, పీటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్, మూర్తి, రాజకన్నప్పన్, ఎంపీలు తంగ తమిళ్ సెల్వన్, ఎస్ వెంకటేష్, ఎమ్మెల్యేలు దళపతి, వెంకటేషన్ భూమినాథన్, మదురై జిల్లా కలెక్టర్ కెజే ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామనాథపురం జిల్లా పరమకుడిలో రూ. 3 కోట్లతో స్వాతంత్య్ర సమరయోధుడు ఇమాన్యుయేల్ శేఖరన్‌కు నిర్మించిన స్మారక మందిరాన్నిప్రారంభించి, ఆయన విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.
అదరహో
అదరహో


