ఎంజీఆర్ జయంతి వేళ.. తొలి ప్రకటన
సాక్షి, చైన్నె: విప్లవ నాయకుడు, అందరివాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ 109వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఎన్నికల మేనిఫెస్టోను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళణి స్వామి విడుదల చేశారు. ఇందులో ఐదు వాగ్దానాలు ప్రకటించారు. ఇక ఎంజీఆర్ జయంతి వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. ఆయన విగ్రహాలు, చిత్ర పటాలకు అన్నాడీఎంకే నేతృత్వంలో పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరిగాయి. రాయపేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎంజీఆర్ విగ్రహానికి ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి అంజలి ఘటించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎంజీఆర్ చిత్ర పటాలను కొలువు దీర్చి మాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు సంక్షేమ పథకాల్ని అందించారు. ఇక ఎంజీఆర్ జయంతి సందర్భంగా అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టో తొలి జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి శనివారం ప్రకటించారు. కుల విలక్కు(ఇంటికి దీపం) పథకం అమలుకు నిర్ణయించారు. ఆ మేరకు కుటుంబ కార్డు ఆధారంగా నెలకు రూ. 2 వేలు చొప్పున కుటుంబ పెద్ద బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. రెండవ వాగ్దానంగా సీ్త్రలకు ప్రస్తుతం ఉన్నట్టుగా , ఇక పురుషులకు సైతం నగర ర వాణా బస్సులలో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించనున్నారు. మూడో వాగ్దానంగా అందరికి సొంతింటి కల సాకారం దిశగా అమ్మ గృహం పథకం, నాలుగో వాగ్దానంగా 100 రోజలుగా ఉన్న గ్రామీణ ఉపాధి పథకాన్ని 150 రోజులకు పెంచడానికి నిర్ణయించారు. ఐదో వాగ్దానంగా అమ్మ ద్విచక్ర వాహనం పథకం అమలు. ఈ మేరకు రూ.25 వేలు వాహనదారులకు రాయితీ కల్పించే విధంగా 5 లక్షల మంది మహిళలకు స్కూటీలు అందించనున్నారు. ఈ మేనిఫెస్టో కేవలం ట్రైలర్ అని, మున్ముందు మరిన్ని పథకాలతో ఆకర్షణనీయ మేనిఫెస్టో విడుదల అవుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంజీఆర్‌కు నివాళి..
రాష్ట్ర ప్రభుత్వం తరపున గిండిలోని తమిళనాడు డాక్టర్‌ఎంజీఆర్ వైద్య వర్సిటీ ఆవరణలో అధికారిక కార్యక్రమంగా వేడుకలు జరిగాయి. ఇక్కడి ఎంజీఆర్ విగ్రహానికి నిలువెత్తు పూల మాలను మంత్రి నాజర్, మేయర్‌ప్రియతో పాటూ అధికారులు అంజలి ఘటించారు. అలాగే, చైన్నెలో మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎంజీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేతృత్వంలోనూ జయంతి వేడుకలు జరిగాయి. ఆ కళగం నేత టీటీవీ దినకరన్ ఎంజీఆర్‌కు నివాళులర్పించారు. అలాగే దివంగత సీఎం జయలలిత నెచ్చెలి , చిన్నమ్మ శశికళ నేతృత్వంలో టీ నగర్‌లో కార్యక్రమం జరిగింది. ఎంజీఆర్ చిత్ర పటానికి ఆమె నివాళులర్పించారు. డీఎండీకే కార్యాలయంలో ఎంజీఆర్‌చిత్ర పటానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ అంజలి ఘటించారు. టీవీకే నేత విజయ్ సైతం ఎంజీఆర్‌కు నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు. పీఎం మోదీ సైతం ఎంజీఆర్ సేవలను గుర్తు చేస్తూ ఎక్స్ పేజిలో నివాళులర్పించారు.
అన్నాడీఎంకే రాష్ట్ర కార్యాలయంలో..
చైన్నె రాయపేటలోని అన్నాడీఎంకే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నేతృత్వంలో పెద్ద సంఖ్యలో అన్నాడీఎంకే వర్గాలు తరలి వచ్చాయి. పార్టీ జెండాను ఎగుర వేసినానంతరం ఎంజీఆర్ విగ్రహానికి పళని స్వామితో పాటూ ఇతర నేతలు నివాళులర్పించారు. అలాగే, పక్కనే ఉన్న దివంగత అమ్మ జయలలిత విగ్రహానికి సైతం పూల మాలలు వేసి అంజలి ఘటించారు. అలాగే, అన్నదాన కార్యక్రమం జరిగింది. పురట్చి తలైవర్ ఎంజీఆర్ జయంతి సావనీర్‌ను ఈసందర్భంగా ఆవిష్కరించారు. అతి పెద్ద కేక్‌ను పళణి స్వామి కట్ చేసి అందరికీ స్వయంగా పంచి పెట్టారు. పేదరికంతో కష్టాలుపడుతున్న పార్టీ కేడర్‌కు సహాయకాలను అందజేశారు. పార్టీ నాయకులు జయకుమార్, ఎస్పీ వేలుమణి, దిండుగల్ శ్రీనివాసన్, కేపి మునుస్వామి, తంగమణి, నత్తంవిశ్వనాథన్, తదితరులు, మహిళా నేతలు వలర్మతి, గోకుల ఇందిర తదితరులు పాల్గొన్నారు. మెరీనా తీరంలోని ఎంజీఆర్ సమాధి పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు.ఇక్కడకు పెద్ద సంఖ్యలో కేడర్ తరలి వచ్చి అంజలి ఘటించారు.
ఎంజీఆర్ జయంతి వేళ.. తొలి ప్రకటన


