కారైకాల్‌లో కార్నివాల్ ఉత్సవం ప్రారంభం
తిరువొత్తియూరు: పుదుచ్చేరి రాష్ట్రం కారైకాల్‌లో పొంగల్ (సంక్రాంతి)పండుగ సందర్భంగా జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ, కళలు , సాంస్కృతిక శాఖ సహా వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్నివాల్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కార్నివాల్ ఉత్సవం శుక్రవారం సాయంత్రం సాంస్కృతిక ఉత్సవాలు వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం వరకు 3 రోజుల పాటు ఉత్సవం జరుగుతుంది. శుక్రవారం మొదటి రోజు కారైకాల్ భారతియార్ రోడ్డులోని ఏలై మారియమ్మన్ ఆలయం దగ్గర రోడ్డు పక్కన కళా ప్రదర్శన జరిగింది. ఈ కళా ప్రదర్శనలో 40కి పైగా పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సాంస్కృతిక శకటాలు, కారైకాల్ జిల్లాకు చెందిన కళాకారుల బొమ్మలాటం, విల్లుపాట్టు, కరగాట్టం, తప్పాట్టం, మయిలాట్టం, పోలీసుల బ్యాండ్ వాయిద్యాలు ప్రజలను, పర్యాటకులను విశేషంగా ఆకర్షించాయి. పాఠశాల విద్యార్థులు భారతియార్, అవ్వయ్యార్, తిరువళ్లువర్, గిరిజనుల వేషధారణలో ఊరేగింపుగా వెళ్లారు. ఆ తర్వాత ఊరేగింపు కార్నివాల్ జరిగే క్రీడా మైదానంలో ముగిసింది. అనంతరం వీఓసీ బైపాస్ రోడ్డులోని క్రీడా మైదానంలో పూల ప్రదర్శన ప్రారంభమైంది. రెండో రోజు శనివారం రాత్రి సంగీత కార్యక్రమం నిర్వహించారు. చివరి రోజైన ఆదివారం కుక్కలు, పిల్లుల ప్రదర్శన నిర్వహించనున్నారు. రాత్రి నృత్య ప్రదర్శనలతో ఉత్సవం ముగుస్తుందని నిర్వాహకులు ప్రకటించారు.


