క్లుప్తంగా
తుపాకీ గురిపెట్టి రౌడీ అరెస్ట్
తిరువొత్తియూరు: ప్రముఖ రౌడీని పోలీసులు తుపాకీ గురి పెట్టి అరెస్ట్ చేశారు. వివరాలు.. చైన్నె చూలైమేడుకు చెందిన వ్యక్తి కనగు అలియాస్ కనగరాజ్. అతనిపై హత్య, తుపాకీ కలిగి ఉండటం వంటి పలు కేసులు ఉన్నాయి. ఈనేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా తన కుటుంబ సభ్యులు, సహచరులతో కలిసి తెన్కాసి జిల్లా కుట్రాలంలో వేడుకల్లో పాల్గొనేందుకు అతను వచ్చాడు. ఈ సంగతి తెలుసుకున్న చైన్నె పోలీసులు, అతనిని అరెస్టు చేయడానికి కుట్రాలంలో మకాం వేశారు. ఆ సమయంలో, ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన రౌడీ కనగరాజ్‌ను, అతనితో పాటూ ఉన్న కార్తీక్, సాబిన్, ప్రకాష్ సహా నలుగురు సహచరులను తుపాకీ గురి పెట్టి పోలీసులు అరెస్టు చేశారు. అతనిని పట్టుకున్న వెంటనే చైన్నెకి తరలించారు. ఈ నేపథ్యంలో, రౌడీ కనగు భార్య మేఘల, తన భర్త ప్రాణాలకు ప్రమాదం ఉందని చైన్నె పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం గమనార్హం.
వండలూరు సమీపంలో ఆటో బోల్తా
తిరువొత్తియూరు: మధురై, అరసరడి, పొన్నగరం ప్రాంతానికి చెందిన శేఖర్ (43) చైన్నె, కుండ్రత్తూరులో ఉంటూ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. గురువారం అతను తన స్వగ్రామానికి వెళ్లేందుకు కుండ్రత్తూరు నుంచి షేర్ ఆటోలో కీలాంబాక్కం వైపు వెళ్తున్నాడు. అదే ఆటోలో సంగిలి(23), వసంతి (35), వైష్ణవి (15), హాసిన్ (9), సతీష్ కుమార్ (57), వసంత (32), అయ్యనార్ (37) సహా ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వేంగడమంగళంకు చెందిన మదన్ రాజ్ (35) ఆటో నడుపుతున్నాడు. మణివాక్కం తర్వాతి ఔటర్ రింగ్ రోడ్డులో వస్తుండగా ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది. దీంతో ఆటో ముందు భాగంలో డ్రైవర్ పక్కన కూర్చున్న శేఖర్ ఎగిరిపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని గమనించిన స్థానికులు ప్రైవేట్ అంబులెనన్స్ ద్వారా పొత్తేరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే శేఖర్ వెళ్లే మార్గంలో మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మిగతా వారు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. తాంబరం ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆటో డ్రైవర్ మదన్ రాజ్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
100 మేకలు, 50 కోళ్లతో బిర్యానీ అన్నదానం
కొరుక్కుపేట: తిరుమంగళం సమీపంలోని ఎస్.గోపాలపురం గ్రామంలో ప్రసిద్ధి చెందిన మునియాండి స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఏటా కనుమ పండుగ రోజున ప్రజలకు మాంసాహార అన్నదాన ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ సంవత్సరం, గోపాలపురం మునియాండి స్వామి ఆలయంలో ఈనెల 9 నుంచి వేడుకలను ప్రారంభించారు. ఈక్రమంలో శుక్రవారం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా వచ్చి మునియాండి స్వామికి అభిషేకం చేశారు. తదనంతరం, భక్తులు శుభ ప్రసాదంగా ఇచ్చిన 100 మేకలు ,150 కోళ్లను ఉపయోగించి మాంసాహార భోజనం తయారు చేసి, మధ్యాహ్నం నుండి రాత్రి వరకు పండుగకు వచ్చిన భక్తులకు పంపిణీ చేశారు. ఈ సంవత్సరం, మొదటిసారిగా, బిర్యానీ వండి అన్నదానంగా పంపిణీ చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుండి 10,000 మందికి పైగా పాల్గొని అన్నదానం స్వీకరించారు.
పాప్‌కార్న్ దినోత్సవం
సాక్షి, చైన్నె: జాతీయ పాప్ కార్న్ దినోత్సవాన్నిపురస్కరించుకుని ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకు పాప్ కార్న్ హ్యాపీ అవర్‌కు చర్యలు తీసుకున్నామని సినీ పోలిస్ ఇండియా సంస్థ ప్రకటించింది. ప్రతి 6 సెకన్లకు ఒక పాప్ కార్న్ టబ్‌ను విక్రయించే విధంగా సినీ థియేటర్లలో చర్యలు తీసుకున్నామని వివరించారు. గత ఏడాది 5 మిలియన్ పాప్ కార్న్ డబ్‌లు, 12 వేల టన్నుల పాప్‌కార్న్ అమ్మకాలు జరిగిందని,ఈ సారి రెట్టింపు శాతం విక్రయాలకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఆ మేరకు ఈనెల 19వ తేదిన పాప్‌కార్న్ దినోత్సవం అని, ఇందులో భాగంగాసినీ పోలిస్ నేతృత్వంలో పాప్ కార్న్ హ్యాపీ అవర్‌ను ప్రత్యేకంగా అందించే విధంగా చర్యలు తీసుకున్నామని ఆ సంస్థ ఎండీ దేవాంగ్ సంపత్ వివరించారు.
తమ్మంపట్టిలో అనధికార జల్లికట్టు
సేలం: సేలం తమ్మం పట్టిలో అనధికారికంగా నిర్వహించిన జల్లికట్టు పోటీలో ఎద్దుల దాడిలో ఇద్దరు మరణించారు. గతంలో ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలతో జల్లికట్టు నిర్వహణకు నిషేధం విధించి ఉన్నారు. అయితే గ్రామస్తులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి నాగియం పట్టి, ఉలిపురం, సెంతార పట్టి, కొండయం పల్లి, తమ్మం పట్టిలలో అనుమతి లేకుండా జల్లికట్టు పోటీలను నిర్వహించారు. వీటిని చూసేందుకు వచ్చిన శక్తివేల్ (32) క్రీడాకారుడు ఎద్దు దాడిలో మృతి చెందారు. అలాగే, కొండయం పల్లిలో జరిగిన జల్లికట్టును వీక్షించేందుకు వచ్చిన వినిత(30) కూడా ఎద్దు పొడవడంతో మరణించారు. ఈ సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. పరారీలో ఉన్న నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు.
క్లుప్తంగా


