ఘనంగా మరువూడల్ ఉత్సవం
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో మరువూడల్ ఉత్సవం శనివారం ఉదయం అతి వైభవంగా జరిగింది. తమిళ తైమాసం మూడవ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆలయంలోని స్వామి వారిని రాజగోపురం దారిలో రెండవ ప్రాకారం వద్దకు తీసుకొచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. అనంతరం స్వామి వార్లను భక్తుల దర్శనార్థం మాడ వీధులతో పాటూ గిరివలయం రోడ్డులో పుష్పాలంకరణ మధ్య ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో గిరివలయం రోడ్డుకు చేరుకొని స్వామి వారికి కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ నిర్వహకులు, భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగతో పాటు సెలవు రోజులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో అరుణాచలేశ్వరాలయంలో భక్తులతో కిటకిటలాడింది.


