నా జీవితం అంతా అపజయాలే..!
తమిళసినిమా: భారతీయ సినిమా గర్వపడే ఛాయాగ్రహకులలో పీసీ.శ్రీరామ్ ఒకరు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన తమిళుడు కావడం గర్వకారణం. దర్శకుడిగానూ తన ప్రత్యేకతను చాటుకున్న పీసీ శ్రీరామ్ ఫిలిం ఇన్స్‌ట్యూట్‌లో ఛాయాగ్రహణం శాఖలో శిక్షణ పొందారు. ఈయన లైటింగ్ స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా షాడో లైట్స్‌తో ప్రయోగాలు చేసిన ఛాయాగ్రహకుడు ఈయన. పీసీ. శ్రీరామ్ పెట్టే ప్రేమ్‌లు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. మణిరత్నం వంటి ప్రముఖ దర్శకుడు చిత్రాలకు ఎక్కువగా పని చేసిన ఈయన నాయకన్ చిత్రానికి గాను 1988లో ఉత్తమ ఛాయాగ్రహకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. అదేవిధంగా నటుడు కమలహాసన్, అర్జున్ కలిసి నటించిన కురుదిపుణల్ చిత్రానికి దర్శకత్వం వహించి విమర్శకులు ప్రశంసలు అందుకున్నారు. సాధారణంగా సినీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈయన ఆసక్తి చూపరు. ఒక వేళ పాల్గొన్నా ముక్తసరిగా మాట్లాడతారు. అలాంటిది ఇటీవల తమిళ్ సినీ పాత్రికేయుల సంఘం చైన్నెలో నిర్వహించిన పొంగల్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈయనతో పాటు ఈయన శిష్యుడు, ఛాయాగ్రాహకుడు వైడ్ యాంగిల్ రవి, వర్ధమాన నటుడు, సిరై చిత్ర కథానాయకుడు ఎల్ కే. అక్షయ్ కుమార్ అతిథులుగా హాజరయ్యారు. సంఘం అధ్యక్షురాలు కవిత నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ పలు ప్రశ్నలకు బదులిచ్చారు. ముఖ్యంగా తన మనోభావాలను విస్పష్టంగా వివరించారు. ‘‘నా జీవితం అంతా అపజయాల మయమే. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈసారి అయినా పాస్ మార్కులు తెచ్చుకోరా? అని అమ్మ చెప్పేది. నేను మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉండేవాడిని. నా ఛాయాగ్రహణంలో డార్క్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయంటారు. చీకటిది ప్రత్యేక ప్రపంచం. థియేటర్లలో ప్రేక్షకులకు అది వేరే అనుభవాన్నిస్తుంది. దీంతో నేను ఏం అనుకుంటానో అదే చేస్తాను. మళ్లీ దర్శకత్వం వహించడానికి నేను రెడీ. అయితే ప్రస్తుత పరిస్థితులు అయోమయంగా ఉన్నాయి. కొందరు నా జీవిత చరిత్రను తెరకెక్కిస్తారా ?అని అడుగుతున్నారు. అలాంటి పని నేను చేయను.ఎందుకంటే జీవిత చరిత్ర అనేది పెద్ద అబద్ధం. అసత్యాన్ని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఏఐ టెక్నాలజీ గురించి చెప్పాలంటే బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏదీ నిరంతరం కాదు. ఇదీ గడించి పోతుంది ‘‘ అని పీసీ.శ్రీరామ్ పేర్కొన్నారు.


