పట్టుదలతో ఉన్నత లక్ష్యాల సాధన
తిరువళ్లూరు: యువత పట్టుదలతో చదివి ఆశయాలను నెరవేర్చుకోవాలని తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ పిలుపు నిచ్చారు. తిరువళ్లూరు మున్సిపాలిటీ పరిధిలోని జైన్ నగర్‌లో రూ.2 కోట్ల వ్యయంతో నాలెడ్జ్ స్టడీ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పనులు పూర్తయిన క్రమంలో స్టడీ సెంటర్‌ను 2024లో ఏర్పాటు చేసి సుమారు మూడువేలకు పైగా వేర్వేరు ప్రభుత్వ పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను అందులో ఉంచారు. ఈ నేపథ్యంలో స్టడీ సెంటర్‌కు నిత్యం వందలాది మంది వచ్చి పోటీ పరిక్షలకు ప్రీపేర్ అవుతున్నారు. ఇటీవల నిర్వహించిన వేర్వేరు పోటీ పరీక్షల్లో 12 మంది, పోలీసులుగా 10 మంది, సీఏ పరిక్షల్లో ముగ్గురి సహా 37 మంది ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో స్టడీ సెంటర్‌ను ఉపయోగించుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 37 మందితో ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ శనివారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టడీ సెంటర్‌ను ప్రభుత్వం ప్రయోగాత్మంగా ఏర్పాటు చేసింది. ఈ స్టడీ సెంటర్‌ను ఉపయోగించుకుని వేర్వేరు పోటీ పరీక్షల్లో పాల్గొని ప్రభుత్వ ఉద్యోగాలకు 37 మంది ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమన్నారు. సంబందిత స్టడీ సెంటర్‌లో మరో 50 వేల రూపాయల విలువ చేసే పుస్తకాలను సైతం తన సొంత నిధులతో అందజేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దామోధరన్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఉదయమలర్, వైస్ ఛైర్మన్ రవిచంద్రన్, కౌన్సిలర్‌లు అరుణజైకృష్ణ, జాన్, తిరువేళాంగాడు యూనియన్ కార్యదర్శి గూలూరు రాజేంద్రన్, ఉప కార్యదర్శి కాంచీపాడి శరవణన్, స్టడీ సెంటర్ ఇన్‌చార్జ్ జ్యోతి పాల్గొన్నారు.


