కానుంపొంగల్‌.. కోలాహలం | - | Sakshi
Sakshi News home page

కానుంపొంగల్‌.. కోలాహలం

Jan 18 2026 7:21 AM | Updated on Jan 18 2026 7:21 AM

కానుం

కానుంపొంగల్‌.. కోలాహలం

● ‘విహారం’తో ఆనందం ● పర్యాటక, వినోద కేంద్రాలు కిటకిట ● తిరుగు పయనానికి ప్రత్యేక బస్సులు

సాక్షి, చైన్నె: రాష్ట్రవ్యాప్తంగా కానుం పొంగల్‌ పర్వదిన కోలాహలం శనివారం మిన్నంటింది. తమ తమ ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలకు ప్రజలు తరలివెళ్లారు. కుటుంబం, బంధు మిత్రులతో కలసి ఆనందంతో ఈ పర్వదినాన్ని గడిపారు. జన సందోహం పెద్దఎత్తున తరలి రావడంతో ఇసుక వేసే రాలనంతగా పర్యాటక, వినోద కేంద్రాలు కిట కిటలాడాయి. వివరాలు.. అందరి నోట పెద్ద పండుగ పిలవబడే సంక్రాంతి వచ్చిందంటే చాలు అందరికీ ఆనందమే. భోగి మంటలు, సంక్రాంతి పొంగళ్లు, కనుమ సందడితో పాటూ కానుం పొంగల్‌ పర్వదినం మహాదానందమే. మూడు రోజుల పాటూ పూజాది కార్యక్రమాలతో పండగను జరుపుకున్న జనం కానుం పొంగల్‌ పర్వదినాన్ని విహర యాత్రతో గడపడం ఆనవాయితీగా వస్తోంది. ఇంటిళ్లి పాది, కుటుంబీకులు, ఆప్తులు, బంధు మిత్రులు ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ వస్తున్నారు. ఆ మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆయా నగరాలు, ప్రాంతాల్లోని ప్రజలు కుటుంబాల సమేతంగా ఈ ఒక్క రోజును మహాదానందంతో గడిపారు. రాష్ట్రంలోని ఏ పర్యాటక ప్రాంతాన్ని చూసినా, వినోద కేంద్రాల్ని చూసినా జనంతో కిక్కిరిశాయి. సినిమాలకు వెళ్లే వాళ్లు కొందరు అయితే, వినోద కేంద్రాలకు, పర్యాటక కేంద్రాలకు వెళ్లే వాళ్లు మరెందరో. రోజంతా కుటుంబంతో కలిసి ఆటా, పాటలతో ఆనందాన్ని పంచుకున్నారు.

చైన్నెలో జనహోరు..

రాష్ట్ర రాజధాని నగరం చైన్నె లోని రోడ్లు గత రెండు రోజులుగా నిర్మానుష్యంగా కనిపించాయి. అయితే, శనివారం ఉదయం నుంచే రోడ్లపై రద్దీ పెరిగింది. నగర శివారుల నుంచి ఇక్కడి పర్యాటక ప్రాంతాలకు పెద్దఎత్తున జనం ఉదయాన్నే తరలివచ్చారు. వీరికోసం చైన్నె నగరంలో పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల్ని సైతం ఆయా మార్గాల గుండా నడిచాయి. జనం అత్యధికంగా తరలి రావడంతో మెరీనా, బీసెంట్‌ నగర్‌, ఎలియట్స్‌ బీచ్‌ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివారులోని నీలంకరై, కోవలం, మహాబలిపురం బీచ్‌లలోనూ జనం రద్దీ పెరిగింది. సముద్రంలోకి ఎవర్నీ వెళ్లనీయకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి, భద్రతను పర్యవేక్షించారు. బారికేడ్ల వద్ద నుంచే సముద్రంలో అలల తాకిడిని, ఆహ్లాద కరవాతావరణాన్ని జనం తిలకించాల్సి వచ్చింది. సముద్ర తీర భద్రతా విభాగం వర్గాలు, కోస్ట్‌ గార్డు వర్గాలు బోట్లు, హెలికాప్టర్లతో చక్కర్లు కొడుతూ భద్రతను పర్యవేక్షించడం, చూపురులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సందర్శకుల భద్రత నిమిత్తం పోలీసులు యంత్రాంగం గట్టి చర్యలు తీసుకుంది. పిల్లలు తప్పిపోకుండా వారి చేతులకు తల్లిదండ్రుల ఫోన్‌ నెంబర్లతో కూడిన ప్రత్యేక బ్యాడ్జీలను ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేయడంతో పాటూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ, ఎత్తయిన ప్రదేశం నుంచి భద్రతను పర్యవేక్షించారు. ఇక జేబు దొంగలు, చైన్‌ స్నాచర్ల భరతం పట్టేం విధంగా ప్రత్యేక బృందాలు మఫ్టిలో డేగ కళ్లతో ప్రజలకు భద్రతను కల్పించాయి. నగరంలోని అన్ని పార్కులు, వినోద కేంద్రాలు జనంతో కిట కిటలాడాయి. ఇక,పండుగ సందడి ముగిసింది. సెలవులు సమాప్తమయ్యాయి. ఆదివారం నుంచి జనం స్వస్థలాల నుంచి చైన్నెతో పాటూ తాము పనిచేస్తున్న వివిధ నగరాలకు తిరుగు పయనం కానున్నారు. వీరి కోసం ఆయా మార్గాలలో ప్రత్యేక బస్సులను నడిపేందుకు రవాణా సంస్థ చర్యలు తీసుకుంది. చైన్నె వైపుగా 3,570 బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా, టాస్మాక్‌ మద్యం దుకాణాల ద్వారా సుమారు 1,000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

కానుంపొంగల్‌.. కోలాహలం1
1/1

కానుంపొంగల్‌.. కోలాహలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement