క్లుప్తంగా
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
అన్నానగర్: వివాహేతర సంబంధం వద్దన్నా తల్లి కొనసాగిస్తుండడంతో కన్న కొడుకు ఆమెను కడతేర్చాడు. సేలం జిల్లా ఎడపాడి సమీపం ఇరుప్పాలి ప్రాంతానికి చెందిన తవసియప్పన్ కూలీ. ఇతని భార్య కనకవల్లి (36). వీరికి కుమార్తె శ్వేత (20), కుమారుడు కార్తీ (18) ఉన్నారు. ఈ స్థితిలో కనగవల్లి అట్టాలిలోని ఒక మగ్గంలో పనికి వెళ్లేది. ఆ సమయంలో అక్కడ పనిచేసే సెంథిల్ (35)తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసి భర్త, కార్తీక్ ఆమెను మందలించారు. కానీ ఆమె వివాహేతర సంబంధాన్ని కొనసాగించి సెంథిల్‌తో కలిసి వెళ్లిపోయింది. తరువాత కనకవల్లిని భర్త తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. విరక్తి చెందిన కార్తీ సేలం కొండప్ప నాయక్కన్‌పట్టిలోని అరియంగడు ప్రాంతంలో అమ్మమ్మ రాజాత్తి ఇంట్లో ఉంటూ, ఆమె కుమారుడు మణికంఠన్ తో కలిసి కూలీ పనికి వెళ్లేవాడు. ఈక్రమంలో కనకవల్లి 14వ తేదీన పొంగల్ పండుగ కోసం రాజాత్తి ఇంటికి వెళ్లి ఆ రాత్రి అక్కడే ఉంది. 15వ తేదీన, వివాహేతర సంబంధం విషయమై కార్తీ తల్లి కనకవల్లిని మందలించాడు. వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆగ్రహించిన కార్తీ కత్తితో కనగవల్లి మెడను నరికి చంపాడు. ఆ తర్వాత తండ్రి, స్నేహితులతో కలసి మృతదేహానికి నిప్పంటించి తర్వాత ఆ ప్రాంతంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ విషయాన్ని శుక్రవారం మద్యం మత్తులో కార్తీ ఆప్రాంత వాసులకు చెప్పాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హత్యకు సంబంధించి కార్తీ, మణికంఠన్, విజయన్, సురేష్, తవాసియప్పన్‌లను అరెస్టు చేశారు.
రెండు బైక్‌లు ఢీ
తిరువొత్తియూరు: రెండు బైక్‌లు ఢీకొని ఓ రిటైర్డ్ ఉద్యోగి మృతిచెందాడు. ఈ ఘటన తిరువైన్నెనల్లూర్‌లో చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లా, తిరువైన్నెనల్లూర్, హనుమాన్ ఆలయ వీధికి చెందిన కృష్ణమూర్తి (62). ఇతను తిరువైన్నెనల్లూర్‌లోని పంచాయతీ యూనియన్ కార్యాలయంలో సహాయకుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. శుక్రవారం రాత్రి బైక్ తీసుకుని బజారుకు వెళ్లాడు. మారియమ్మన్ గుడి వద్ద వెళుతుండగా అదే ప్రాంతానికి చెందిన సురేష్ కుమారుడు కార్తీక్ (20) నడుపుతున్న కొత్త బైక్, కృష్ణమూర్తి బైక్‌ను ఢీకొంది. ఈప్రమాదంలో కృష్ణమూర్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
1000 మందికి అన్నదానం
కొరుక్కుపేట: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న డాక్టర్ ఎంజీఆర్ 109వ జయంతి సందర్భంగా, అన్నాడీఎంకే యువజన విభాగం జాయింట్ సెక్రటరీ డాక్టర్ సునీల్.వి నాయకత్వంలో, దక్షిణ చైన్నె నార్త్ వెస్ట్ జిల్లాలోని 135వ సర్కిల్‌లోని హరేయమ్మన్ కోవిల్ స్ట్రీట్‌లో 1,000 మందికి చికెన్ బిర్యానీ, సంక్షేమ సహాయకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ టి. నగర్ 135వ (కె) సర్కిల్ కార్యదర్శి పి. పద్మనాభన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునిల్ వి మాట్లాడుతూ 2026 ఎన్నికల్లో అన్నాడీఎంకే అఖండ విజయం సాధిస్తుందని, మళ్లీ పళని స్వామి సీఎం పీఠం అధిరోహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు . ఇందులో పార్టీ కార్యనిర్వాహకులు కె. జయపాల్, కె. సూర్యకళ, గోర్డాన్ వి. సురేష్‌కుమార్. కరాటే ఎస్. శేఖర్, వి. హరిబాబు, ఎస్.ఎం.ఎస్. జాకీర్ హుస్సేన్, ఎం. లోగనాథన్, ఆర్.సి.ఎ. ప్రభాకరన్, ఎం.చందనలక్ష్మి, ఇ.మోహనకృష్ణన్ పాల్గొన్నారు .
అభివృద్ధి పనుల
పరిశీలన
కొళత్తూరులో
తిరువొత్తియూరు: కొళత్తూరులో కపాలీశ్వరర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కొత్త భవనం, సీనియర్ సిటిజన్ల రెసిడెన్సీని మంత్రి పి.కె. శేఖర్‌బాబు శనివారం పరిశీలించారు. వివరాలు.. మైలాపూర్, కపాలీశ్వరర్ – ఆలయం తరపున – కొళత్తూరులో నడుస్తున్న కపాలీశ్వరర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి రూ.25 కోట్ల అంచనాతో కొత్త భవనం నిర్మించడానికి 2024 డిసెంబర్‌లో శంకుస్థాపన చేశారు. దాని తర్వాత వచ్చే ఫిబ్రవరి నుండి కాలేజీ క్లాసులు కొత్త భవనంలో జరిగేలా నిర్మాణ పనులు పూర్తి వేగంతో జరుగుతున్నాయి. అదేవిధంగా కొళత్తూరు, రాజాజీ నగర్‌లో వృద్ధాశ్రమ భవనం నిర్మిస్తున్నారు. ఈ రెసిడెన్సీలో కుటుంబంలో చూసుకునే వీలులేని 100 మంది వృద్ధులు ఉండేలా వసతి గదులు, వంటగది, భోజనశాల, అంబులెనన్స్‌తో కూడిన వైద్య కేంద్రం, నడక మార్గంతో కూడిన చిన్న పార్క్, యోగా , ధ్యాన మందిరం వంటి సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పి.కె. శేఖర్‌బాబు కొళత్తూరులో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు, ఇంజినీర్లకు సూచించారు.


