
ఆంబూరు అల్లర్ల కేసు వాయిదా
వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఆంబూరులోని ప్రైవేటు షూ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సామిల్‌బాషా 2015వ సంవత్సరంలో ఒక పాఠశాలలో వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి తిరుప్పూరులో ఉన్న సామిల్‌బాషాను అరెస్ట్ చేయగా అతను అనారోగ్యం కారణంగా మృతి చెందారు. అప్పట్లో విషయం తెలుసుకున్న సామిల్‌బాషా బంధువులు అప్పట్లో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టిన సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో సామిల్‌బాషా పోలీసులు కొట్టడంతోనే మరణించాడని ఆరోపించారు. దీంతో పోలీసులు 191 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ సమయంలో 11 ప్రభుత్వ బస్సులు, ఏడు పోలీసు వాహనాలు, నాలుగు బైకులను అల్లర్లలో పాల్గొన్న వారు ధ్వంసం చేశారు. ఈ కేసు విచారణ తిరుపత్తూరు కోర్టులో జరుగుతోంది. ఈ కేసు విచారణ మంగళవారం వెలవడనున్న నేపథ్యంలో ఆంబూరు కోర్టు వద్ద ఇద్దరు ఎస్పీలు, 1100 మంది పోలీసులతో పటిష్ట పోలీసు బందోబస్తు నిర్వహించారు. దీంతో ఆంబూరు పట్టణం పూర్తిగా పోలీసులతో నిండిపోయింది. అయినప్పటికీ కేసు విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.