
క్లుప్తంగా
ఈ– రేషన్ కార్డుపై
బీరు బాటిల్ ఫొటో
– అవాకై ్కన కార్డుదారులు
కొరుక్కుపేట: మదురై సమీపంలో ఈ–రేషన్ కార్డుపై కుటుంబ పెద్ద ఫొటోకు బదులుగా బీరు బాటిల్ ఫొటోతో విడుదల కావడంతో ఆ కార్డుదారుడు అవాక్కయ్యాడు. మదురై జిల్లా కల్లుపట్టి పంచాయితీ యూనియన్ పైరెయూర్ సమీపంలోని సిల్లపుల్లంపట్టి గ్రామానికి చెందిన తంగవేలు(46) భార్య జయప్రియ. తంగవేలు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు . రేషన్‌కార్డులో అతని భార్య జయప్రియ కుటుంబ పెద్ద తంగవేలుతోపాటూ అతని కుమారుడు, కుమార్తె సభ్యులుగా ఉన్నారు. వారి కుమార్తె ఇటీవల వివాహం చేసుకుంది.దీని తరువాత ఆమె కుమార్తె పేరును ఈ–సేవా కేంద్రంలో రేషన్‌కార్డు నుంచి తొలగించారు. ఇంతలో జయప్రియ గత వారం సంక్షేమ బోర్డుకు నమోదు చేసుకోవడానికి వెళ్లారు. అక్కడ కొత్తకార్డు తీసుకున్నారు. అందులో కార్డుపై బీర్ బాటిల్ ఉండడంతో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివాహిత ఆత్మహత్య
తిరువొత్తియూరు: చైన్నె పుళల్‌కు సమీపంలోని వినాయకపురం రామలింగం వీధికి చెందిన వళ్లరసు(25) ఆటో డ్రైవర్. అతని భార్య గాయత్రి (23). వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 3 సంవత్సరాలు, ఒక సంవత్సరం వయస్సు గల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో దంపతుల మధ్య తరచుగా సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా వళ్లరసు ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి రావడంతో గాయత్రి నిరాశకు గురైంది. ఈ పరిస్థితుల్లో మంగళవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న గాయత్రి బెడ్‌రూమ్ తలుపు లోపల నుండి లాక్ చేసుకొని, చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన భర్త, తన భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పుళల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చైన్నెలోని ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి పంపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్డీఓ విచారణకు ఆదేశించారు.
మేకను చంపిన చిరుత
సేలం: ఈరోడ్ జిల్లా చెన్నిమలైలోని షిల్లాంగ్ కట్టువలసు ప్రాంతంలో పళనిస్వామి(85) నివశిస్తున్నాడు. అతని తోట చెన్నిమలై–అయ్యంపాలయం రహదారిపై ఉంది. సమీపంలో ఒక అటవీ ప్రాంతం ఉంది. దురైసామి అనే వ్యక్తి తోటను నిర్వహిస్తున్నాడు. తోటలో కంచెతో కూడిన ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేయబడింది. అక్కడే 12 మేకలను పెంచుతున్నారు. సోమవారం రాత్రి దురైసామి ఎప్పటిలాగే మేకలను ఎన్‌క్లోజర్‌లో బంధించి ఇంటికి వెళ్లాడు. తరువాత ఉదయం తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు ఎన్‌క్లోజర్‌లో ఉన్న ఒక మేక కనిపించకుండా పోయింది. ఇది చూసి అతను షాక్ అయ్యాడు. ఎన్‌క్లోజర్‌లో ఉన్న ఇతర మేకలు అరుస్తున్నాయి. తరువాత దురైసామి మేక కోసం వెతికినప్పుడు, తోట దగ్గర మెడపై రక్తపు గాయాలతో చనిపోయి పడి ఉండడం గుర్తించాడు. మేక ఒక గుర్తుతెలియని జంతువు కరిచి చనిపోయిందని తేలింది. అటవీ శాఖకు ఈ విషయం తెలియడంతో వారు అక్కడికి చేరుకుని, నమోదైన పాదముద్రలను పరిశీలించారు. చిరుతపులి మేకను కరిచి చంపినట్లు నిర్ధారించారు. ఇది విన్న గ్రామస్తులు షాక్ అయ్యారు. ఈ ప్రాంతంలోని పశువుల పెంపకందారులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ సూచించింది.
రోడ్డు వసతి కల్పించాలని నిరసన
వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడి సమీపంలోని పెరుమాళ్‌కుప్పం గ్రామంలో సుమారు వంద కుటుంబాలకు పైగా జీవిస్తున్నాయి. అయితే కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లేందుకు రోడ్డు వసతి లేదు. కాలి నడకన వెల్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనిపై పలు మార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చి మొరపెట్టుకున్నా ఎటువంటి ఫలితం లేక పోయింది. ఇదిలా ఉండగా రోడ్డును అక్రమించుకున్న వారు వినతి పత్రాలు ఇచ్చే వారిని చంపుతామని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులందరూ ఇళ్లకు నల్ల జెండాలు కట్టి ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకుండా నిరసన తెలిపారు. దీనిపై రెవెన్యూ అధికారులు విచారణ చేస్తున్నారు.
మలేషియాలో మొదటిసారి జల్లికట్టు
తిరువొత్తియూరు: తిరుచ్చిలో మలేషియా ఎంపీ డత్తో శరవణన్, శ్రీలంక తూర్పు ప్రావిన్స్ మాజీ గవర్నర్ సెంథిల్ తొండమాన్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో శ్రీలంక తర్వాత మలేషియాలో మొదటిసారిగా జల్లికట్టు పోటీలను నవంబర్ నెలలో నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మలేషియాలో భారతదేశానికి చెందిన వంశావళి యువత ఎక్కువగా పశువులను పెంచుతున్నారని పేర్కొన్నారు. జల్లికట్టు పోటీకి ఇప్పటివరకు 250 ఎద్దులను సిద్ధం చేశారని, మలేషియాలో 3 లక్షల మంది తమిళులు పనిచేస్తున్నారని వివరించారు. ఈ పోటీలో తమిళులు పాల్గొంటారన్నారు. అక్కడ జల్లికట్టు పోటీల నిర్వహణకు మొదటిసారి అనుమతులు పొందే ప్రక్రియలు జరుగుతున్నాయన్నారు. ఎద్దులకు, ఎద్దులు పట్టే వీరులకు తగిన శిక్షణ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పోటీలకు అనుమతులు, నిబంధనలు ఇండియా లో ఉన్నట్లే శ్రీలంకలో జరిగిన జల్లికట్టు పోటీలలో కూడా పాటించబడ్డాయని, అదే పద్ధతి మలేషియాలో కూడా పాటిస్తామని తెలిపారు.