
డ్రోన్ కెమెరాలతో పండుగ బందోబస్తు
వేలూరు: వేలూరు పట్టణంలో జరిగే వినాయక చవితి ఊరేగింపును డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంచనున్నట్లు ఎస్పీ మయిల్‌వాగనం తెలిపారు. వేలూరు నేతాజీ మైదానంలో వినాయక చవితి వేడుకల బందోబస్తు కోసం 1500 మంది పోలీసులను వేర్వేరు ప్రాంతాలకు విధులు కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 27, 28వ తేదీల్లో జరిగే వినాయక చవితి బందోబస్తుకు వెళ్తున్న పోలీసులు విగ్రహాలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో జరిగే ప్రతి విషయాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఆదేశించామన్నారు. జిల్లాలో వివిధ నేరాలకు పాల్పడుతున్న 62 మంది రౌడీలకు ఇప్పటికే అఫిడవిట్‌లు పంపించామన్నారు. చవితి వేడుకల్లో ఎలాంటి సమస్యలు సృష్టించినా వెంటనే వారిని అరెస్ట్ చేస్తామన్నారు. వినాయకుడి విగ్రహ ఊరేగింపును పట్టణంలో 128 సీసీ కెమెరాల ద్వారా నిఘా ఉంచడంతో పాటు మూడు డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఊరేగింపులో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకుండా బందోబస్తు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. మొబైల్ కమాండ్ కంట్రోల్ యూనిట్ పోలీసులు కూడా బందోబస్తులో నిమగ్నమై ఉంటారన్నారు. అనంతరం వేలూరు, సైదాపేట, మురుగన్ ఆలయం నుంచి పట్టణంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. చవితి వేడకలను పురస్కరించుకొని వేలూరు పట్టణంలోని మార్కెట్, వస్త్ర దుకాణాలు తదితర ప్రాంతాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.