
తిరుత్తణి పట్టణ రోడ్లకు మహర్దశ
తిరుత్తణి: తిరుత్తణి పట్టణంలో గుంతల మయంగా మారిన రోడ్లను రూ.13 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించనున్నారు. ఈ పనులపై మున్సిపల్ అధికారులు ఉత్సాహం చూపడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుత్తణి మున్సిపల్ పరిధిలోని 21 వార్డుల్లో గత రెండేళ్లలో వర్షాలతోపాటు తాగునీటి కుళాయిల పైపులైన్లు, రోడ్లు తవ్వడం ఇతర పనులతో పట్టణ వీధుల రోడ్లన్నీ ధ్వంసమై, గుంతలమయంగా మారాయి. ఆ రోడ్లలో నడిచి వెళ్లేందుకు కూడా మహిళలు, చిన్నారులతోపాటు ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో పట్టణ రోడ్ల ఆధునికీకరణకు వీలుగా పట్టణ ప్రాంతాల అభివృద్ధి నిధుల నుంచి రూ.13 కోట్లు విడుదల చేశారు. దీంతో మున్సిపల్ పరిధిలోని 21 వార్డుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణానికి మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని రెండవ వార్డు చెరువుకట్ట వీధిలో నిర్మాణంలో ఉన్న సిమెంట్ రోడ్డు పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ సరస్వతి, మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పరిశీలించారు. పనుల నాణ్యతపై అధికారులకు సూచనలిచ్చారు. కొత్త సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.