
ఆర్‌ఎంకే కళాశాలలో జూనియర్ హ్యాకథాన్
తిరువళ్లూరు: కవరపేటలోని ఆర్‌ఎంకే కళాశాలలో నిర్వహించిన జూనియర్ హ్యాకథాన్–2025 పోటీలకు విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన లభించింది. తిరువళ్లూరు, చైన్నె జిల్లాల్లోని 65 పాఠశాలలకు చెందిన 241 నమూనాలతో కూడిన విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు అతిథులను ఆకర్షించాయి. ఉత్తమ ప్రాజెక్టులుగా ఎంపికై న వారికి బహుమతులను ప్రదానం చేసే కార్యక్రమం కళాశాల ఆవరణలో జరిగింది. కార్యక్రమానికి ఆర్‌ఎంకే విద్యాసంస్థల చైర్మన్ ఆర్‌ఎస్ మునిరత్నం అధ్యక్షత వహించగా వైస్ చైర్మన్ ఆర్‌ఎం కిషోర్ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్బంగా ఆర్‌ఎస్ మునిరత్నం మాట్లాడుతూ విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీయడానికి జూనియర్ హ్యాకథాన్–25 పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రాజెక్టులో రీసైక్లింగ్, ఆపరేషన్, ఆరోగ్యం, వ్యవసాయం, సస్టెయినబుల్ ఎనర్జీ, రోబోల రూపకల్పన, స్మార్ట్ ఆటోమేషన్, క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్‌మెంట్, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, డిజిటల్ అర్ట్ అండ్ క్రియేటివిటీ, వర్చువల్ రియాలిటీతో సహా 12 అంశాల కింద విద్యార్థులు ప్రాజెక్టులను రూపొందించిన ప్రదర్శనలో ఉంచినట్టు వివరించారు. ఈ ప్రదర్శనలను టీసీఎస్, టెక్ మహేంద్ర, జోహో, ఎన్‌టీటీ డేటా, హెచ్‌సీఎల్, సీటీఎస్ మోటార్స్, క్యాబ్‌జెమిని తదిరత సంస్థలకు చెందిన సాంకేతిక నిపుణులు పరిశీలించారని ఆయన గుర్తు చేశారు. ఇంజినీరింగ్ విద్య ఆవిష్కరణలో సంస్థ భవిష్యత్తు దృక్పథాన్ని ఆయన వివరించారు. అనంతరం ఉత్తమ ప్రాజెక్టులుగా మొదటి స్థానంలో నిలిచిన దాసర్ హయ్యర్ సెకండరీ పాఠశాలకు లక్ష రూపాయలు, రెండో స్థానంలో నిలిచిన మహర్షి విద్యామందిర్ పాఠశాలకు చెందిన విద్యార్థులకు రూ.50 వేలు, మూడో స్థానంలో నిలిచిన ఆర్‌ఎంకే సీనియర్ సెకండరీ పాఠశాల, కోలా పెరుమాల్‌చెట్టి వైష్ణవ స్కూల్, కలైమగల్ విద్యామందిర్ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు 25వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జ్యోతినాయుడు, కార్యదర్శి యలమంచి ప్రదీప్, ఆర్‌ఎంకే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహ్మద్ జునైత్, సురేష్‌కుమార్, అన్బుచెలియన్ తదివతరులు పాల్గొన్నారు.