
క్లుప్తంగా
మహిళా ఉద్యోగులకు
లైంగిక వేధింపులు
–మహిళా సంఘం నేతల ఆందోళన
తిరువళ్లూరు: మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తమిళనాడు గ్రామీణ జీవనోపాధి విభాగం మేనేజర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం నేతలు బుధవారం ఉదయం ఆందోళన చేశారు. తిరువళ్లూరులోని మెడికల్ కళాశాల ఎదుట జరిగిన ఆందోళనకు సంఘం జిల్లా అధ్యక్షురాలు శశికళ అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ తమిళనాడు గ్రామీణ జీవనోపాధి విభాగంలో పని చేసే మహిళల పట్ల మేనేజర్ సభాపతి అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడన్నారు. వెంటనే అతనిపై విచారణ జరిపి విధుల నుంచి తొలగించాలని కోరారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందింకుంటే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహిళా సంఘం నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
లారీ దగ్ధం
తిరువొత్తియూరు: కోవిలంబాకం సత్యనగర్ 6వ వీధికి చెందిన జాన్‌బాషా (33కి సొంత లారీ ఉంది. దీని ద్వారా పల్లవరం, క్రోంపేట్, తాంబరం ప్రాంతాల్లోని ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించే పని చేస్తుండేవాడు. అయితే ఈ విధంగా తొలగించిన వ్యర్థాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా తిరునీర్మలై చెత్తకుప్ప వద్ద పడేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఎప్పటిలాగే అనకాపుత్తూరు నుంచి తిరునీర్మలై వెళ్లే క్వారీ రోడ్డులో ఉన్న చెత్తకుప్ప దగ్గర చెత్తను పారవేసేందుకు లారీని ఆపారు. ఆ సమయంలో లారీకి మంటలంటుకున్నాయి. దీంతో తాంబరం అగ్నిమాపక, రెస్క్యూ దళానికి సమాచారం అందించాడు. అగ్నిమాపక సిబ్బంది గంటపాటూ పోరాడి మంటలను ఆర్పివేశారు. అయినప్పటికీ, లారీలో కొంత భాగం కాలిపోయింది. దీనిపై శంకర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపగా, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టడం వల్ల, గాలిలో మంటలు వ్యాపించి లారీకి అంటుకుని కాలిపోయినట్లు తెలిసింది.
అనుమతుల్లేని ఆస్పత్రికి సీల్
అన్నానగర్: చైన్నె కార్పొరేషన్‌లోని అడయార్ జోన్‌లోని వేళచ్చేరిలోని వార్డ్ 177 లోని ముత్తుకృష్ణన్ వీధిలో ఓ ‘మల్టీ స్పెషాలిటీ’ ఆస్పత్రి పనిచేస్తోంది. ఈ ఆస్పత్రి భవనానికి కార్పొరేషన్ నుంచి సరైన భవన అనుమతి తీసుకోలేదని తెలుస్తుంది. ఈ విషయంలో భవన యజమానికి నోటీసు జారీ చేశారు. తదనంతరం, అడయార్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ హార్దిన్ రోసారియా ఆదేశాల మేరకు, కార్పొరేషన్ అధికారులు ఆస్పత్రి భవనాన్ని మూసివేసి ‘సీల్’ వేశారు. దీని కోసం వేళచ్చేరి ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
గుంతలో పడి కారు బోల్తా
– ముగ్గురు యువకుల మృతి
అన్నానగర్: కడలూరు జిల్లాలోని విరుధాచలం సమీపంలోని ఎరుమనురులో ఆలయ ఉత్సవం సందర్భంగా 11వ తేదీ రాత్రి వీధి నృత్యం జరిగింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు, బాబు కుమారుడు ఆదినేష్ (21), వీర యాండియన్ కుమారుడు అయ్యప్పన్ (29), మణి కుమారుడు వేల్ మురుగన్ (21), కన్నన్ కుమారులు వెంకటేశన్ (25), గౌతమ్ (20), పచ్చముత్తు కుమారుడు నటరాజన్ (21), తెల్లవారుజామున ఒంటి గంటల ప్రాంతంలో విరుదాచలం సమీపంలోని కోలంచియప్పర్ ఆలయం సమీపంలోని టీ దుకాణానికి కారులో వెళ్లారు. వెంకటేశన్ కారు నడుపుతున్నాడు. అక్కడి టీ దుకాణం మూసివేసి ఉండడంతో వారు తాల్ చిత్తలూర్ బైపాస్ రోడ్డులో ఏదైనా టీ దుకాణం తెరిచి ఉండవచ్చని భావించి అక్కడికి బయలుదేరారు. చిత్తలూరు బైపాస్‌లో వేగంగా వెళుతుండగా, అకస్మాత్తుగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. కారు శిథిలాలలో చిక్కుకున్న ఆదినేష్, అయ్యప్పన్, వేల్‌మురుగన్ అనే ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వాహనదారులు విరుధాచలం పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాయపడిన వెంకటేశన్, గౌతమ్, తాడరాజన్‌ను రక్షించి చికిత్స కోసం విరుధాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరణించిన ముగ్గురి మృతదేహాలను పోస్ట్ మార్టానికి తరలించారు.
వలస కార్మికుల సర్వేకు చర్యలు
కొరుక్కుపేట: తమిళనాడులో వలస కార్మికులపై సమగ్ర సర్వేకు చర్యలు తీసుకున్నారు. తమిళనాడు కార్మిక శాఖ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోకి వలస వస్తే అన్ని వలస కార్మికులపై సమగ్ర సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. వలస కార్మికులు, వారి సామాజిక–ఆర్థిక పరిస్థితులు, ఉపాధిపై వివరణాత్మక వివరాలను సేకరించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సర్వే ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోనుందని అధికారులు వెల్లడించారు. 2015–16లో గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం, తమిళనాడులో 67.74 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని అంచనా. ప్రస్తుతం, తమిళనాడు ప్రభుత్వం 2025లో వలస కార్మికుల సర్వే నిర్వహించడానికి టెండర్లను ఆహ్వానించింది. వలస కార్మికుల సంక్షేమం కోసం తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో ఈ సర్వే ఎంతో సహాయపడుతుందని భావిస్తున్నారు.