
చెట్ల కోసం చెట్లతో మాట్లాడుదాం
– సీమాన్ సరికొత్త నినాదం
తిరుత్తణి: చెట్లకోసం మాట్లాడుదాం, చెట్లతో మాట్లాడుదాం అనే సరికొత్త నినాదంతో ప్రకృతిపై తన ప్రేమను చాటుకునే పనిలో పడ్డారు నామ్ తమిళర్ పార్టీ ప్రధాన కోఆర్డినేటర్ సీమాన్. వివరాల్లోకెళితే.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అధికార పార్టీ రోజుకో కొత్త పథకంతో ఓటర్లను ఆకర్షించే పనిలో వుండగా, ప్రతిపక్ష నాయకుడు ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేసుకుంటున్నారు. అదే తరహాల్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ మహానాడు ద్వారా తన సత్తా చాటే పనిలో వున్నారు. డీఎండీకే పార్టీ, పీఎంకే సైతం ప్రజల వద్ద వెళ్లి ప్రచారం చేసుకుంటున్నారు. అయితే అందుకు భిన్నంగా సీమాన్ ప్రకృతి పట్ల తన ప్రేమను చాటుకునే పనిలో పడ్డారు. గతవారం పశువులు పెంపకం, పశువుల పట్ల ప్రేమను చూపించగా, బుధవారం చెట్లపట్ల తన ప్రేమను చాటుకున్నారు. ఆగస్టు 30న చెట్ల దినోత్సవాన్ని తిరుత్తణి సమీపంలోని అరుంగుళంలో వనంలో వేడుకలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం చెట్లను పరిశీలించిన సీమాన్ చెట్లను హత్తుకుని, ముద్దాడి చెట్లతో మాట్లాడి ప్రకృతిపట్ల తన ప్రేమను చాటుకున్నారు.