
క్లుప్తంగా
అన్నానగర్: మాధవరం సమీపంలోని పొన్నియమ్మన్ మేడు తణికాసలం నగర్‌కు చెందిన ఆనందన్ (55). మాధవరం ట్రాఫిక్ ఇన్వెస్టిగేషనన్ విభాగంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మెడికల్ లీవ్‌లో ఉన్నారు. అతని భార్య సరళ. వీరికి ఇద్దరు కుమార్తెలు. సోమవారం మధ్యాహ్నం ఆనందన్ కొలత్తూరు లోని వెట్రి నగర్‌లోని తన తల్లి ఇంటికి వచ్చాడు. భోజనం చేసిన తర్వాత పడుకోవడానికి తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. తరువాత సాయంత్రం చాలా సేపటి వరకు ఆనందన్ తన గది నుంచి బయటకు రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పొరుగువారి సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, ఆనందన్ సీలింగ్ ఫ్యానన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందాడు. ఈ విషయం పై తిరు.వి.కె. నగర్ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కిల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. పోలీసులు నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో సబ్–ఇన్‌స్పెక్టర్ ఆనందన్ తన పెద్ద కుమార్తె తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించడం, ఆత్మహత్యకు పయత్నించడం వల్ల కలిగిన మానసిక వేదన కారణంగా బలవన్మరణానికి పాల్పడినట్లు తేలింది.
కొరుక్కుపేట: సృజనాత్మకత, సంస్కృతి, ప్రతిభను ప్రదర్శించే రీతిలో సోమవారం ఆరంభమైన చైతన్య మెగా ఇంటర్ కాలేజియేట్ ఫెస్ట్ 2025–26 కు అనూహ్యమైన స్పందన లభించింది. శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళక కళాశాల ఐక్యూఏసీ, కలాలయ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా రెండు రోజులు చైతన్య పోటీలు కళాశాల ప్రాంగణంలో నిర్వహించింది. కళాశాల కరస్పాండెంట్ ఊటుకూరు శరత్ కుమార్, ప్రిన్సిపాల్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ పి. బి. వనీత తదితరులు పోటీలను ప్రారంభించారు. నగరంలోని దాదాపు 20 కళాశాల నుంచి 400 మందికి పైగా విద్యార్థినులు ఈ ఫెస్ట్‌లో పాల్గొన్నారు. సమూహ గానం, ద్వంద్వ అడాప్ ట్యూన్ ,గ్రూప్ డ్యాన్స్,ఫోటో ఫ్రేమ్ తయారీ, థ్రెడ్ బ్యాంగిల్ తయారీ, ఫైర్‌లెస్ వైర్‌లెస్ వంట, సాంప్రదాయ మేక్ ఓవర్ తదితర పోటీ ల్లో ప్రతిభను చాటుకున్నారు.
సాక్షి, చైన్నె: చైన్నె ఈక్కాడు తాంగల్‌లోని వివిధ రకాల ఉత్పత్తి సంస్థగా ఉన్న ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన నిర్వాహకులను ఆదాయ పన్ను శాఖ అధికారులు టార్గెట్ చేశారు. సోమవారం ఉదయాన్నే చైన్నె, కాంచీపురం, వేలూరుల్లోని ఆ సంస్థల ప్రతినిధులు, నిర్వాహకులు, అనుబంధ సంస్థలకు చెందిన వారి కార్యాలయాలు, ఇళ్లలో మొత్తం పది చోట్ల పది బృందాలుగా ఐటీ అధికారులు సోదాలలో నిమగ్నమయ్యారు.
తిరువళ్లూరు: చెరువు కరకట్టపై నిర్మించిన నివాసాలను ఆక్రమణగా గుర్తించిన అధికారులు పోలీసుల సాయంతో సోమవారం ఉదయం జేసీబీ సాయంతో కూల్చివేశారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అక్రమణల గుర్తింపు, తొలగింపు పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. కాలువలు, చెరువులు, వర్షపు నీరు వెళ్ళే కాలువల వద్ద వున్న అక్రమణలను గుర్తిస్తున్న రెవవెన్యూ అదికారులు వాటిని కూల్చివేస్తున్నారు. ఇందులో భాగంగానే కాకలూరు చెరువు కరకట్టపై వున్న నివాసాలను ఆక్రమణగా గుర్తించిన అధికారులు కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం తొలగించారు. కాగా ఈ సమయంలో రెవెన్యూ, స్థానికుల మధ్య స్వల్ప వాగ్వాదం నెలకొంది. దీంతో తాహశీల్దార్ రజినీకాంత్, డిప్యూటీ తాహశీల్దార్ దినేష్, రెవెన్యూ ఇన్పెక్టర్ ఉధయకుమార్, వీఏఓ సుబ్రమణ్యం తదితరులు పోలీసులకు సమాచారం అందించి వారి సాయంతో జేసీబీ ద్వారా నివాసాలను తొలగించారు.
కొరుక్కుపేట: చైన్నెలోని సైదాపేట రోడ్డులో రూ.28.70 కోట్లుతో నిర్మిస్తున్న ఆరు అంతస్తుల కొత్త ఆసుపత్రిని రాష్ట్ర ఆర్యోగ శాఖామంత్రి సుబ్రమణ్యన్ సోమవారం పరిశీలించారు. 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భారీ వైద్య సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్న ఈ ఆసుపత్రి పురోగతిపై అధికారులతో చర్చించారు. 120 ఏళ్ల నాటి ప్రభుత్వ ఆసుపత్రి సముదాయంలో ఉన్న సైదాపేటలో కొత్తగా నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని పరిశీలించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పాత నిర్మాణాలతో కూడిన ఈ ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేయడానికి, ప్రభుత్వ నిధులతో రూ.28.70 కోట్లు వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు.

క్లుప్తంగా