
ధనుష్ ఇడ్లీకడై ఎప్పుడంటే..
తమిళసినిమా: సక్సెస్‌ఫుల్ బాటలో పయనిస్తున్న నటుడు ధనుష్ దర్శకుడిగానూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈయన చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఇడ్లీకడై చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. నటి నిత్యామీనన్ నాయకిగా నటిస్తున్న ఇందులో ధనుష్‌కు చెల్లెలిగా నటి షాలిని పాండే నటించడం విశేషం. ఈమె ఇంతకు ముందు తెలుగు, తమిళం భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలుగులో విజయ్ దేవరకొండకు జంటగా అర్జున్‌రెడ్డి చిత్రంలో నటించి, పాపులర్ అయ్యారు. చాలా గ్యాప్ తరువాత తమిళంలోకి ఇడ్లీకడై చిత్రం ద్వారా రీ ఎంట్రీ అవుతున్నారు. అదే విధంగా నటుడు పార్తీపన్, అరుణ్‌విజయ్, సముద్రఖని తదితర ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆకాశ్ భాస్కర్ తన డాన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్‌్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని ఎన్న సుఖమ్ అనే లిరికల్ వీడియో పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాట ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను అందుకుంది. ఈ పాటను నటుడు ధనుష్, గాయనీ శ్వేతామోహన్ పాడారు. ఈ చిత్రంలో ధనుష్ పాడిన ఎన్‌సామి తందానే అనే మరో పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇడ్లీకడై చిత్రాన్ని అక్టోబర్ ఒకటో తేదీన విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించాయి. నటుడు ధనుష్ ప్రస్తుతం హిందీ చిత్రం తేరే ఇష్క్ మేన్‌ను పూర్తి చేసి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటి మమితా బైజా నటిస్తుండగా కరుణాస్, జయరామ్, కేఎస్ రవికుమార్, సురాజ్ వెంజారముడు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ కోసం రామనాథపురం, తేని ప్రాంతాల్లో జరుపుకోవడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం తరువాత అమరన్ చిత్రం ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో నటించనున్నట్లు సమాచారం.
ఇకపోతే తన అభిమానులను నెలకొక్క రోజున 500 చొప్పున కలుసుకోవాలని నిర్ణయించుకున్న ధనుష్ గత జూలై 27వ తేదీన, ఆగస్టు 3వ తేదీన అభిమానులకు కలుసుకున్నారు. అయితే తదుపరి విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం రెండో షెడ్యూల్ పూర్తి అయిన తరువాత అభిమానులను కలుసుకుంటారని సమాచారం.