ధీరన్‌కు నివాళులు
● సీఎం పుష్పాంజలి
సాక్షి, చైన్నె : స్వాతంత్య్ర సమరయోధుడు ధీరన్ చిన్నమలై విగ్రహానికి సీఎం ఎంకే స్టాలిన్ గురువారం నివాళులర్పించారు. ధీరన్ చిన్నమలై జయంతి వేడుకను అధికారిక కార్యక్రమంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారుల నేతృత్వంలోఽ ధీరన్‌కు నివాళులర్పించే కార్యక్రమాలు జరిగాయి. చైన్నె గిండిలోని ధీరన్ చిన్నమలై విగ్రహం పరిసరాల్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆయన చిత్ర పటానికి సీఎం ఎంకే స్టాలిన్ పుష్పాంజలి ఘటించారు. మంత్రులు ముత్తుస్వామి, స్వామినాథన్, సెంథిల్ బాలాజీ, ఎం సుబ్రమణియన్, చక్రపాణి, కయల్వెలి సెల్వరాజ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై, కొంగునాడు మక్కల్ దేశియ కట్చి నేత, ఎమ్మెల్యే ఈశ్వరన్, తదితరులు సైతం నివాళులర్పించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు అంజలి ఘటించారు. అలాగే, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కే పళణి స్వామి సెల్వం, నేతలు జయకుమార్, తంగమణి, కేపీ మునుస్వామి, గోకుల ఇందిర, వలర్మతి తదితరులు పుష్పాంజలి ఘటించారు. తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్, ప్రధాన కార్యదర్శి జీఆర్ వెంకటేష్‌తో పాటూ ముఖ్య నేతలు ధీరన్ చిత్ర పటానికి అంజలి ఘటించారు. తమిళగ వెట్రి కళగం తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ తదితరులు నివాళులర్పించారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు నివాళులర్పించినానంతరం ధీరన్ చిన్నమలై సేవలను గుర్తు చేసుకున్నారు.
ధీరన్‌కు నివాళులు


