
తిరుత్తణికి పోటెత్తిన భక్తజనం
తిరుత్తణి: తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఆదివారం శుభ ముహూర్తదినం సందర్భంగా భక్తజనం పోటెత్తారు. మురుగన్ కొలువైన ఆరు పుణ్యక్షేత్రాల్లో ఐదో క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు. ఆదివారం సెలవుదినం కావడంతో పాటు శుభ ముహూర్తం రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో కొండకు చేరుకున్నారు. దీంతో ఘాట్‌రోడ్డు మార్గంలో వాహనాల రద్దీ చోటుచేసుకుంది. ట్రాఫిక్ సమస్యతో భక్తులు గంటపాటు ఇబ్బంది పడ్డారు. కొండ ఆలయ మాడవీధుల్లో భక్తుల సందడి నెలకొంది. రూ.100 శీఘ్ర దర్శనం మార్గంలో రెండు గంటలు, ఉచిత దర్శనానికి మూడు గంటల పాటు భక్తులు వేచివుండి స్వామిని దర్శించుకుని హుండీల్లో కానుకలు చెల్లించారు. మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి సేవలో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అముద పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 60 వేలకు పైబడి భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు.

తిరుత్తణికి పోటెత్తిన భక్తజనం