●బాలుడు, ఇద్దరు మహిళలు మృతి
కొరుక్కుపేట: మూడు చక్రాల సైకిల్‌ను ఓ కారు ఢీ కొట్టడంతో బాలుడు, ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. రామనాథపురం జిల్లా తంగచ్చి మఠానికి చెందిన సిలంబరసన్(35) మూడు చక్రాల సైకిల్‌పై పట్టణానికి వెళ్లి పాత పేపర్, కార్డ్‌బోర్డ్, ప్లాస్టిక్ బాటిళ్లను సేకరిస్తాడు. దీనిని సాధారణంగా తూత్తుకుడిలోని ఒక దుకాణంలో విక్రయిస్తారు. ఈ క్రమంలో తంగచ్చి మఠానికి చెందిన సిలంబరసన్, అతని భార్య తంగమ్మాళ్ (35), అదే ప్రాంతానికి చెందిన ఆరుముగం భార్య మారియమ్మాళ్(60), కొడుకు సతీష్(7)తో కలిసి ట్రైసైకిల్‌పై వెళ్లాడు. ఆదివారం ఉదయం వ్లాతికులం తర్వాత సూరంగూడి సమీపంలోని కీశ షణ్ముగపురం గ్రామంలో పాత పేపర్, ప్లాస్టిక్ బాటిళ్లు, కార్డులు సేకరించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఈస్ట్‌కోస్ట్ రోడ్డు దాటారు. ఆ సమయంలో ఆ రోడ్డు మీదుగా వస్తున్న కారు ట్రై సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో బాలుడు సతీష్, తంగమ్మాళ్, మరియమ్మాళ్ అక్కడికక్కడే మృతి చెందారు. కన్యాకుమారి జిల్లా మార్తాండం తండాకు చెందిన సెల్వరాజ్ (55), అతని భార్య కుమారి తంగం(49) కారులో వచ్చారు. కారు నడుపుతున్న అతని కుమారుడు జెనిత్ (29) గాయపడ్డారు. సమాచారం అందుకున్న సూరంగుడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రక్షించి చికిత్స నిమిత్తం తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందినవారి మృతదేహాలను వ్లాతి కులం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం
ఇప్పిస్తానని మోసం
●దంపతుల అరెస్టు
తిరువొత్తియూరు: ప్రభుత్వ ఉద్యోగం తీసి ఇస్తామని చెప్పి నకిలీ నియామక పత్రాలు ఇచ్చి మోసం చేసిన భార్యాభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈరోడ్ జిల్లా కురికారణపాలయం వీఆర్ అవెన్యూకు చెందిన మోహన్(47) తిరుపూర్‌లో సొంతంగా పని చేసుకుంటున్నాడు. ఇందులో నష్టం రావడంతో చైన్నె మింట్ ప్రాంతంలో ఉన్న ఒక లాడ్జిని లీజుకు తీసుకుని దాన్ని నడుపుతున్నాడు. అతని భార్య కౌసల్య(35). ఈ క్రమంలో అరియలూరు జిల్లా వాలాజా నగర్‌కు చెందిన దినేష్ కుమార్(26) వారికి పరిచయమయ్యాడు. అతను తమకు తెలిసిన మహిళకు ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఈ సంగతి తెలుసుకున్న మోహన్, కౌసల్య ఇద్దరు తమకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు బాగా తెలుసునని, వారి ద్వారా ప్రభుత్వ ఉద్యోగం తీసిస్తామని చెప్పి దినేష్ కుమార్ వద్ద రూ.1 లక్ష తీసుకున్నారు. తర్వాత ఆ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం దొరికిందని ఒక నియామక పత్రం ఇచ్చి పంపారు. దీన్ని దినేష్ కుమార్ తనిఖీ చేయగా అది నకిలీదని తెలిసింది. దీనిపై దినేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మోహన్, కౌసల్య దంపతులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 49 నకిలీ నియామక పత్రాలు, పలు వేర్వేరు శాఖలకు చెందిన నకిలీ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 6 సెల్ ఫోన్లు, ఒక లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు.
బాలికలను రక్షించిన పోలీసులు
తిరువొత్తియూరు: తల్లిదండ్రులు తిట్టారని తిరుచ్చి నుంచి చైన్నెకి పారిపోయి వచ్చిన నలుగురు బాలికలను చైన్నె మెరీనా తీరంలో పోలీసులు రక్షించారు. వివరాలు.. తిరుచ్చి జిల్లా ఎడమలైపట్టి పుదూర్ ఇందిరానగర్ బాలమురుగన్ ఆలయ వీధికి చెందిన 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక, ఎనిమిదో తరగతి చదువుతున్న ఆమె చెల్లెలు, తైలం నగర్‌కు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక, ఏడవ తరగతి చదువుతున్న ఆమె చెల్లెలు ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. దీనికి సంబంధించి వారి తల్లిదండ్రులు ఎడమలై పట్టి పుదూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అదృశ్యమైన నలుగురు బాలికలు తిరుచ్చి నుంచి ప్రభుత్వ బస్సు ద్వారా చైన్నె తాంబరంలో దిగి తర్వాత మెరీనా సముద్ర తీరానికి చేరుకున్నారు. బాలికలు కనిపించలేదనే విషయాన్ని తిరుచ్చి పోలీసులు చైన్నె పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మెరీనా పోలీసులను అలెర్ట్ చేశారు. మెరీనా పోలీసు ఇన్‌స్పెక్టర్ ఇళయరాజా, సబ్ ఇన్‌స్పెక్టర్ పార్తీబన్, పోలీసులు మణిగండన్, పలనిచ్చామి, రమేష్ కుమార్ తదితరులు మెరీనా తీరంలో ఆడుకుంటున్న బాలికలను రక్షించి చైన్నెకి వచ్చిన వారి తల్లిదండ్రులకు అప్పగించారు.