నిఘా నీడలో చేపాక్కం! | - | Sakshi
Sakshi News home page

నిఘా నీడలో చేపాక్కం!

Oct 8 2023 1:44 AM | Updated on Oct 8 2023 9:03 AM

- - Sakshi

సాక్షి, చైన్నె : ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా చైన్నె చేపాక్కం స్టేడియం వేదికగా ఆదివారం భారత్‌, ఆస్ట్రేలియా జట్లు తమ తొలి మ్యాచ్‌లో తడపడనున్నాయి. ఇందుకోసం చేపాక్కంలో సర్వం సిద్ధం చేశారు. ఆ పరిసరాలను నిఘా నీడలోకి తీసుకొచ్చారు. అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వివరాలు.. తమిళనాట క్రికెట్‌ అభిమానం మరీ ఎక్కువే అన్న విషయం తెలిసిందే. చైన్నె చేపాక్కంలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్‌ జరిగితే చాలు టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి.

ఈ పరిస్థితుల్లో ప్రపంచ కప్‌ క్రికెట్‌ పోటీల్లో చైన్నె చేపాక్కం స్టేడియం ఐదు మ్యాచ్‌లకు వేదికగా మారనుంది. ఇందులో భారత్‌ జట్టు ఓ మ్యాచ్‌ మాత్రమే ఆడనుంది. ఈ మ్యాచ్‌ను ఆదివారం డే అండ్‌ నైట్‌ పోటీగా నిర్వహించనున్నారు. ఇప్పటికే టికెట్లు అన్ని అమ్ముడయ్యాయి. సుమారు 40 మంది వరకు వీక్షించేందుకు ఈ స్టేడియంలో వీలుంది. తరలి వచ్చే అభిమానుల వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలాలు సిద్ధం చేశారు. అలాగే చేపాక్కం పరిసరాల్లో ట్రాఫిక్‌ మార్పులు జరిగాయి. అభిమానుల కోసం అర్ధరాత్రి వరకు అదనంగా ఎంఆర్‌టీఎస్‌ రైలు సేవలు నడుపనున్నారు.

మెట్రో రైలు సేవలకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఆదివారం మరమ్మతుల కారణంగా తాంబరం – బీచ్‌ మధ్య ఎలక్ట్రిక్‌ రైళ్ల సేవలు ఆగుతుండటంతో ఆ పరిసరాల నుంచి వచ్చే అభిమానులను బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే స్టేడియం పరిసరాలు వివిధ వర్ణాల పెయింటింగ్స్‌తో శోభాయమానంగా కనిపిస్తున్నాయి. అభిమానులు, ప్రేక్షకులు స్టేడియంలోకి వెళ్లేందుకు వీలుగా ఆయా మార్గాల నుంచే బారికేడ్లను ప్రవేశ మార్గం వరకు ఏర్పాటు చేశారు.

నిఘా కట్టుదిట్టం..
ఈ స్టేడియంలో ఆదివారం భారత్‌, ఆసీస్‌ మ్యాచ్‌తో పాటు 13వ తేదీన న్యూజిలాండ్‌ – బంగ్లాదేశ్‌, 18న న్యూజిలాండ్‌ – ఆఫ్గానిస్తాన్‌, 23న పాకిస్తాన్‌ – ఆప్గానిస్తాన్‌, 27న పాకిస్తాన్‌ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య చైన్నె వేదికగా మ్యాచ్‌లు జరనున్నాయి. దీంతో మ్యాచ్‌లు జరిగే రోజుల్లో స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ మార్పుల ప్రకటన వెలువడింది. అలాగే స్టేడియం పరిసరాల్లో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. 2 వేల మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నారు. ఈ పరిసరాలలోని నిఘా నేత్రాలను కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.

అలాగే పోర్టబుల్‌ వాకింగ్‌ కెమెరాలను రంగంలోకి దించారు. ఈ కెమెరాలు మనుషుల తరహాలో నడుచుకుంటూ వెళ్లి వీడియో చిత్రీకరిస్తున్నాయి. స్టేడియానికి వచ్చే మహిళా అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకభద్రతా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన పక్షంలో కటకటాల్లోకి నెట్టే విధంగా ఏర్పాట్లు చేశారు. మ్యాచ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినా, వర్షం బెంగ అభిమానులను వెంటాడుతోంది. గత రెండు మూడు రోజులుగా చైన్నెలో మధ్యాహ్నం, సాయంత్రం వేళవ్వో అక్కడక్కడ వర్షం పడుతోంది. శనివారం సాయంత్రం కూడా వర్షం కురవడంతో ఆదివారం వర్షం మ్యాచ్‌ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement