సీసీ గోడలు నిర్మిస్తాం..
పాలకవీడు : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పరిధిలోని మేజర్, మైనర్ కాలువల ఆధునీకరణకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తుంటే.. క్షేత్రస్థాయిలో పనులు మాత్రం నాసిరకంగా జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్ మేజర్ కాలువ, దానికి అనుబంధంగా ఉన్న మైనర్ కాలువల సీసీ లైనింగ్ పనుల తీరుపై రైతులు, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాతి కట్టడాలపైనే సీసీ లైనింగ్..
సాగునీటి వృథాను అరికట్టి ఆయకట్టు పరిధిలోని పంటలకు సక్రమంగా నీటిని అందించాలనే లక్ష్యంతో ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. ఇందుకోసం దశాబ్దాల క్రితం నిర్మించి, శిథిలావస్థకు చేరిన పాత రాతి కట్టడాలను పూర్తిగా తొలగించి పటిష్టమైన సీసీ లైనింగ్ చేయాల్సి ఉంది. కానీ కొన్నిచోట్ల పాత కట్టడాలను తొలగించకుండానే వాటిపైనే సీసీ లైనింగ్ పనులు చేస్తూ.. మమ అనిపిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పనులను నిత్యం పర్యవేక్షించాల్సి అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పనులు చేపట్టిన కొద్ది రోజులకే తూములు పగిలి పోతుండడం పనుల్లోని డొల్లతనాన్ని తేటతెల్లం చేస్తోంది.
పర్యవేక్షణ కరువు..
కాలువ కట్టలను పటిష్టం చేసేందుకు వీక్‌గా ఉన్న కట్టలను తొలగించి మట్టి నింపి రోలింగ్ చేయాల్సి ఉంది, కానీ అవేవీ జరగడం లేదు. కాలువ కట్టల పటిష్టత, బాటలు, తూముల నిర్మాణం పూర్తిస్థాయిలో చేపట్టడంలేదని రైతులు వాపోతున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందని, కాంట్రాక్టర్లు, అధికారుల లోపాయికారీ ఒప్పందాలతోనే నాణ్యతా ప్రమాణాలు గాలికి వదిలేశారని రైతులు ఆరోపిస్తున్నారు. నిధులు భారీగా ఖర్చవుతున్నా భవిష్యత్‌లో ప్రయోజనం శూన్యమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిల్లో కాలువల ఆధునీకరణ పనులు పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నెస్పీ కాల్వ ఆధునీకరణ
పనుల్లో నాణ్యత కరువు
పాత రాతి కట్టడాలను తొలగించకుండానే సీసీ లైనింగ్
కాల్వ కట్టల పటిష్టత పనులూ నామమాత్రంగానే..
అధికారులు పర్యవేక్షించాలని రైతుల డిమాండ్
అధికారుల పర్యవేక్షణ ఏది..
కోట్లాది రూపాయల విలువైన పనులు జరుగుతున్నా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో నాణ్యతను నిరంతరం పరిశీలించాల్సి ఉండగా.. అవి జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్లు ఉపయోగిస్తున్న నిర్మాణ సామగ్రిని అధికారులు సమగ్రంగా తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాఽధికారులు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
జాన్‌పహాడ్ మేజర్, మైనర్ కాల్వల సీసీ లైనింగ్, ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. రెండు విడతలుగా కాలువకు నీటి విడుదల కావడంతో పనుల్లో జాప్యం జరిగింది. రైతులు ఆరోపిస్తున్నట్లుగా ఎక్కడా పాత రాతి కట్టడాలను వదిలేయడంలేదు. రాతి కట్టడాల స్థానంలో సీసీ గోడలు నిర్మిస్తాం. డ్రాపింగ్ ఏరియాల్లోనూ సీసీ గోడలు నిర్మిస్తాం. పనులను ప్రతి రోజూ పర్యవేక్షిస్తున్నాం.
– సతీష్, ఎన్నెస్పీ ఏఈఈ,
పాలకవీడు మండలం.


