ట్యాంక్‌ బండ్‌ పనులు ముమ్మరం | - | Sakshi
Sakshi News home page

ట్యాంక్‌ బండ్‌ పనులు ముమ్మరం

Nov 8 2026 10:24 AM | Updated on Nov 8 2026 10:24 AM

అటు సగం.. ఇటు సగం వదిలేసి

ఫ సుందరీకరణ దిశగా

కోదాడ పెద్దచెరువు కట్ట

ఫ ఇరువైపులా సీసీ గోడల నిర్మాణం

ఫ మూడోసారి ప్రజారోగ్య శాఖ

ఆధ్వర్యంలో పనులు కొనసాగింపు

కోదాడ : కోదాడ పెద్దచెరువు ట్యాంక్‌ బండ్‌ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ.8 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనులను మొదట పదేళ్ల క్రితం నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించి మధ్యలో వదిలేశారు. ఆ తరువాత మున్సిపల్‌ శాఖ అధికారులు కొన్ని పనులు చేపట్టి వారూ వదిలేశారు. తాజాగా మూడోసారి ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

కట్ట రెండువైపులా గోడలు

పెద్దచెరువు మట్టి కట్టను ప్రస్తుతం ఉన్న 2.4 మీటర్ల నుంచి 6.25 మీటర్లు మేర వెడల్పు చేశారు. పట్టణం వైపు ఉన్న అలుగు నుంచి ఖానాపురం వరకు ఉన్న అలుగు వరకు 1,250 మీటర్ల పొడవునా వెడల్పు చేస్తున్నారు. దీంతో పాటు కట్టకు ఇరువైపులా అడుగున్నర వెడల్పు, మూడు అడుగుల ఎత్తులో సీసీ గోడ నిర్మాణం చేస్తున్నారు. దీంతోపాటు అనంతగిరి రోడ్డు నుంచి కట్టమైసమ్మ దేవాలయం వరకు సీసీ అప్రోచ్‌రోడ్డు నిర్మాణం కూడా చేయనున్నారు. కట్టపై హైమాస్ట్‌ లైట్లు, రైయిలింగ్‌తో కూడిన ఫుట్‌పాత్‌ను ఏర్పాటు చేసి సుందరీకరణకు మొక్కలు నాటనున్నారు. అంతే కాకుండా పెద్దచెరువు వ్యూ పాయింట్‌ను కూడా అభివృద్ది చేయనున్నారు.

పాతవి పీకేసి.. కొత్తవి పెడతారట!

ఐదేళ్ల క్రితం కోదాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.22 లక్షలు ఖర్చుచేసి పెద్దచెరువుపై సింగిల్‌హర్మ్‌ లైట్లు, బేంచీలను ఏర్పాటు చేయడంతో పాటు మొక్కలను కూడా నాటారు. రూ.5లక్షల ఖర్చుతో అప్రోచ్‌ రోడ్డును వేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌ లేక ఈ లైట్లు ఏనాడూ వెలిగింది లేదు. తాజాగా ఈ సింగిల్‌హర్మ్‌ లైట్లను తీసేసి వాటి స్ధానంలో హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేస్తామని నాడునాటిన మొక్కలు తొలగించి మళ్లీ నాటుతామని అధికారులు చెబుతుండడం కాస్త విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు.

కోదాడ చెరువు కట్ట అభివృద్ధి పనుల్లో అధికారుల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పట్టణం వైపు ఉన్న చెరువు కట్టపై పలువురు ఇళ్లను నిర్మించుకున్నారు. ఇక్కడ కట్ట బలహీనంగా ఉంది. అధికారులు ఇక్కడ దాదాపు 500 మీటర్ల మేర కట్టను అభివృద్ధి చేస్తే పట్టణం నుంచి నేరుగా చెరువు కట్టపైకి వెళ్లవచ్చు. ఇక రాఘవాపురం వైపు కూడా మూడవ అలుగు నుంచి ప్రస్తుతం పబ్లిక్‌ క్లబ్‌ భవనం ఉన్న వైపు చెరువు కట్టను కూడా అధికారులు అభివృద్ధి చేయకుండా వదిలేశారు. కేవలం మధ్యలో పనులు చేసి మమ అనిపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement