నాగారం : ఫణిగిరి క్షేత్రంలోని బౌద్ధ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వాడ్రేవు చినవీరభద్రుడు, ఎన్‌ఆర్‌ఐ జీడిగుంట విజయసారథి, చిట్టగాంగ్ విప్లవ వనితలు పుస్తక రచయిత, సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత పింగళి చైతన్య అన్నారు. శనివారం వారు ఫణిగిరి బౌద్ధ మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో లభించిన శిల్పాలు ప్రపంచంలోనే ప్రత్యేకమైనవని కొనియాడారు. నేలకొండపల్లి, ఫణిగిరిని బౌద్ధక్షేత్రాలను కలిసి బౌద్ధారామం కారిడార్‌గా మార్చాలని అన్నారు. అనంతరం మ్యూజియంలో ప్రాచీన బౌద్ధ సంపద, స్థూపచైత్యాలు, శిల్పాలు, మహాస్థూపాలు, విహారగదులు, శిలాస్థావరాలు, బుద్ధుడి జాతక కథలను పరిశీలించారు. కార్యక్రమంలో పురావస్తుశాఖ సిబ్బంది గట్టు వీరయ్య, యాకయ్య, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.


