తుంగతుర్తి : మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ‘లక్ష్యం’ స్వచ్ఛంద సంస్థ ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు నాబార్డ్ జిల్లా అధికారి రవీందర్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో లక్ష్యం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో 15 రోజులపాటు మహిళలకు నిర్వహించిన చైల్డ్ కేర్ గారియాట్రిక్ కేర్ శిక్షణ శుక్రవారం ముగిసింది. శిక్షణ తీసుకున్న 35 మంది మహిళలకు ఆయన సర్టిఫికెట్లను అందించారు. అనంతరం మాట్లాడుతూ చిన్నారులు, వృద్ధుల సంరక్షణకు సంబంధించిన కోర్సుల్లో శిక్షణ ఇచ్చి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన 8 మందిని ఇంద్రాణి సర్వీసెస్ ద్వారా నెలకు రూ.20వేల వేతనంతో ఉద్యోగం కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో చలపతి, స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, లక్ష్యం ఎన్జీఓ చైర్మన్ శంకర్, సెక్రెటరీ లత, ట్రెజరర్ అభినయ్, వెలుగు సీసీ రమేష్ పాల్గొన్నారు.


