మఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత ప్రహ్లాద యోగానంద శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని గురువారం అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాత
సేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరిపించారు. అనంతరం నూతన పట్టు వస్త్రాంలకరణతో స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. కల్యాణతంతు, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ప్రతిష్టించి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.


