ఇక్కడ ముంచారు.. మరోచోట తెరిచారు! | - | Sakshi
Sakshi News home page

ఇక్కడ ముంచారు.. మరోచోట తెరిచారు!

Nov 5 2026 1:34 AM | Updated on Nov 5 2026 1:34 AM

చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం

ఫ బినామీల పేరుతో భారీగా

కొత్త రైస్‌మిల్లుల ఏర్పాటు

ఫ మంతనాలకు కోదాడలో

కార్యాలయం ఏర్పాటు చేసుకున్న అధికారి

మిల్లర్లకు సీఎంఆర్‌ కేటాయించే సమయంలో జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి, జిల్లా మేనేజర్‌, స్థానిక తహసీల్దార్‌, మిల్లర్‌తో కలిసి ఒక కమిటీ ఏర్పాటవుతుంది. కేటాయించిన ధాన్యం పక్కదారి పట్టకుండా, అక్రమాలకు పాల్పడితే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే జిల్లా స్థాయి అధికారులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ ఫోర్స్‌ సభ్యులు కూడా మిల్లర్లతో కుమ్మక్కవడంతో కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడం మానేశారు. ఈ అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఇటీవల రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అధికారులు.. జిల్లాలో 43 మిల్లుల్లో దాదాపు రూ.660 కోట్ల వరకు సీఎంఆర్‌ బకాయిలు ఉన్నట్లు గుర్తించి, మిల్లర్లకు సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.

కోదాడ: ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి ఇచ్చిన వందల కోట్ల రూపాయల కస్టమ్‌ మిల్లింగ్‌ ధాన్యం (సీఎంఆర్‌) మాయం చేసిన డిఫాల్టు మిల్లర్లు సరికొత్త దందాకు తెరలేపారు. ఒక జిల్లాలో డిఫాల్టర్‌గా మారిన మిల్లర్‌.. పక్క జిల్లాలో బినామీల పేరుతో భారీఎత్తున కొత్త మిల్లులను ఏర్పాటు చేయడమే కాకుండా, సిక్‌ ఇండస్ట్రీస్‌ను లీజుకు తీసుకుంటూ దందాను మళ్లీ మొదలుపెట్టారు. సివిల్‌ సప్లయ్‌ శాఖలో పనిచేస్తున్న అధికారులతో ఉన్న పాత పరిచయాలను అడ్డుపెట్టుకుని మరోసారి కోట్ల రూపాయల సీఎంఆర్‌ ధాన్యాన్ని కేటాయింపు చేసుకున్నారు. ఇందుకోసం అధికారులకు లక్షల రూపాయలు ముడుపుల రూపంలో చెల్లించినట్లు ఇటీవల విజిలెన్స్‌ అధికారులు చేసిన దాడుల్లో బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. సంవత్సరాల తరబడి సీఎంఆర్‌ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న మిల్లర్లకు తిరిగి ధాన్యం కేటాయించడంలో ఇంటిదొంగల హస్తం స్పష్టంగా ఉంది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సివిల్‌ సప్లై శాఖకు చెందిన ఓ అధికారి కోదాడలోనే ప్రైవేట్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని చక్రం తిప్పినట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు.

ఒక్కడే ఎనిమిది మిల్లుల్లో భాగస్వామి

కోదాడ పట్టణంలో భారీగా సీఎంఆర్‌ బకాయిలు పడ్డ మిల్లర్‌కు చెందిన బంధువులు, బినామీల పేరుతో యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు మూతపడ్డ మిల్లులను లీజుకు తీసుకున్నారు. అధికారులతో ఉన్న పరిచయాలతో మరోసారి భారీగా సీఎంఆర్‌ ధాన్యం కేటాయింపులు పొందారు. గతంలో సూర్యాపేట జిల్లాలో పనిచేసిన సదరు అధికారి ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో పనిచేస్తుండటంతో అక్కడ తన బినామీల ద్వారా దందా నడిపించినట్లు తోటి మిల్లర్లే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు గుర్తించినప్పటికీ, వారినీ ప్రసన్నం చేసుకుంటూ తన దందాను కొనసాగిస్తున్నారు. పది రోజుల క్రితం విజిలెన్స్‌ దాడుల్లో ఈ అక్రమాలన్నీ ఒక్కటొకటిగా వెలుగు చూశాయి.

అనుమతులు లేకున్నా రూ.కోట్లలో

కేటాయింపులు

కోదాడ మండల పరిధిలోని ఓ గ్రామంలో రైస్‌మిల్లు ఏర్పాటు చేసిన వ్యాపారికి ఏకంగా రూ.34 కోట్ల ధాన్యాన్ని అధికారులు కేటాయించారు. సదరు వ్యాపారి ఆ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విక్రయించేశాడు. ఆలస్యంగా గుర్తించిన అధికారులు నామమాత్రపు ఫిర్యాదులు చేసి చేతులు దులుపుకున్నారు. పోలీసులు సైతం అతను ముందస్తు బెయిల్‌ తెచ్చుకునే వరకు అరెస్ట్‌ చేయకుండా సహకరించారనే ఆరోపణలున్నాయి. మిల్లు ఆస్తులపై బ్యాంకు లోన్‌ ఉండటంతో బ్యాంక్‌ అధికారులు మిల్లును స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇదే మిల్లర్‌ మరికొందరితో కలిసి తిరిగి అదే మండల పరిధిలో మరో భారీ రైస్‌మిల్లును ఏర్పాటు చేయగా, అధికారులు మళ్లీ భారీగా సీఎంఆర్‌ ధాన్యం కేటాయించడం గమనార్హం. అదేవిధంగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెరువులో ఉన్న ఓ రైస్‌మిల్లుకు జిల్లాకు చెందిన సివిల్‌ సప్లయ్‌ అధికారి ఏకంగా రూ.87 కోట్ల విలువైన సీఎంఆర్‌ ధాన్యం కేటాయించారు. వాస్తవానికి ఆ మిల్లుకు అంత సామర్థ్యం లేకున్నా.. సదరు అధికారి భారీగా దండుకుని నిబంధనలను తుంగలో తొక్కి ధాన్యం కట్టబెట్టాడని విజిలెన్స్‌ గుర్తించి, కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement